అన్నలూ నన్ను మీరే నడిపించాలి.. ఐఏఎస్ అధికార్లతో ఏపీ సీఎం జగన్

Update: 2019-06-25 04:11 GMT

 సుబ్రహ్మణ్యం అన్నా.. గౌతం అన్నా.. నన్ను మీరే నడిపించాలి. అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్ లను కోరారు. ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తన గౌరవార్థం ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు, రెవెన్యూ శాఖ ప్రత్యెక ప్రధాని కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేక విందులో జగన్ ఆసక్తికరంగా మాట్లాడారు. నేను కొత్తగా వచ్చాను. నాకు అనుభవం లేదు. అన్నలూ మీరంతా నన్ను ముందుకు నడిపించండి అంటూ అయన అధికారులనుద్దేశించి వ్యాఖ్యానించారు. అంతే కాకుండా అధికారం నాకు కొత్త. సుబ్రహ్మణ్యం అన్న (సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం), గౌతమ్‌ అన్న (డీజీపీ గౌతమ్ సవాంగ్), మన్మోహన్‌ అన్నలు నన్ను ముందుండి నడిపించాలి. నేను తీసుకునే నిర్ణయాల్లో ఏమైనా తప్పులు కనిపిస్తే సుబ్రహ్మణ్యం అన్న, గౌతమ్‌ అన్న గైడ్‌ చేయాలి. అందరం కలిసి పనిచేద్దాం. ప్రజలకు మంచి చేద్దామనుకుంటన్న నాకు మీరంతా సహకరించాలి" అని జగన్‌ కోరారు.

ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి నాకు మంచి అనుభవం గల ఉన్నతాధికారుల బృందం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్బంగా అయన చెప్పారు. అనుభవజ్ఞులైన మీ మార్గదర్శకత్వం, సహకారంతో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దగలననే నమ్మకం నాలో కలిగిందన్నారు. ఈ రోజు ఉదయం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నా మదిలో ఉన్న ఆలోచనలు మీ అందరితో పంచుకున్నాను. మీ ప్రేమను, అభిమానాన్ని చూరగొనడం చాలా సంతోషకరమైన విషయమని ముఖ్యమంత్రి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు మన్మోహన్ సింగ్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి మెమెంటో అందజేసి, శాలువాతో సత్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐఏఎస్ ఉదయలక్ష్మి ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్, ఉన్నతాధికారులందరూ పాల్గొన్నారు.

Tags:    

Similar News