ఏపీ సీఎం జగన్ రాజకీయ ఎత్తుగడ.. ప్రతి మాటలోనూ గెలుపు ధీమా
Jagan: ఇంచార్జులను మార్చేసిన ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ రాజకీయ ఎత్తుగడ.. ప్రతి మాటలోనూ గెలుపు ధీమా
Jagan: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలా తాను ఏపీలో ఓటమి పాలు కాకూడదని రాజకీయ ఎత్తుగడ వేస్తున్నారు ఏపీ సీఎం జగన్... రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిపైనే దృష్టి సారించాలని నిర్ణయించారాయన.. పార్టీలో అంతర్గత విబేధాలున్న చోట ఇంచార్జులను మార్చేశారు. కొత్త వారిని నియమించారు. మూడు రాజధానుల విషయంలో తన మొండితనం మొదటికే మోసం తెచ్చేలా వ్యవహరించకూడదని జగన్‌కు తేటతెల్లమయింది. ఈ అనుమానం కూడా ఆయనలో మొదలయిందన్న భావన కనిపిస్తోంది.
కొంచం కష్టపడితే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లోనూ గెలుపు మనదే అన్న ధీమా వ్యక్తం చేసిన జగన్.. కొన్ని నెలల వ్యవధిలోనే తన ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. బుగ్గ కారుల్లో తిరగడం తప్ప... మీరేం పనిచేయడం లేదంటూ కేబినెట్ సహచరులపై ఫైర్ అయ్యారు. మంత్రి పదవులు పీకేస్తాను... జాగ్రత్త.... అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో చంద్రబాబును ఓడంచబోతున్నామని ఉత్సాహంగా చెప్పిన జగన్.. ప్రతి నియోజకవర్గానికీ మంత్రి పదవి హామీ ఇస్తున్నారు.
పార్టీ గ్రాఫ్ పెంచడానికి... ప్రజాభిమానాన్ని చూరగొనడానికి జగన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కానీ.. ఎమ్మెల్యేలు మాత్రం తమ వ్యవహార శైలితో ప్రజల్లో చులకన కావడమే కాకుండా... పార్టీ ప్రతిష్టను, ప్రభుత్వ పరువును మంటగలుపుతున్నారని జగన్ నిర్మొహమాటంగా ఎమ్మెల్యేల ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఓవైపు ఇంచార్జిలు, మరో వైపు వలంటీర్లు తమపై పెత్తనం చలాయిస్తుంటే.. నియోజకవర్గంలో డమ్మీలుగా మిగిలిపోయామనీ, అందుకే ప్రజా వ్యతిరేకత... ప్రభుత్వ విధానాలతో, వలంటీర్ల నిర్వాకంతో వచ్చిందే తప్ప... తమ వల్ల కాదనీ ఎమ్మెల్యేలు అంతర్గత చర్చల్లో ఆవేదన వ్యక్తం చేశారు. అయినా జగన్ వారికి టికెట్లు ఇచ్చి గెలిపించాలనే యోచన చేస్తున్నారు.
తమకు రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ రాదని కొంతమంది ఎమ్మెల్యేలు స్థిర నిర్ణయానికి వచ్చేసినట్లు అవగతమవుతోంది. ఇప్పటికే మంత్రి పదవులు తీసేస్తానని హెచ్చరించినా... వారిలో మార్పు రాకపోవడమే కాకుండా ఆయన హెచ్చరికలను లైట్‌గా తీసుకున్నారు. ఈనెల 19న జరిగే సమావేశం విషయంలో ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు. గత రెండు సమావేశాల్లో ఎదురైన అనుభవమే మరోసారి ఎదురవుతుందా... అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పనితీరు మెరుగుపరుచుకోవాలని జగన్ క్లాస్ తీసుకుంటారనీ, అసలు నియోజకవర్గంలో పనిచేసే అవకాశమే లేని తాము పనితీరు ఎలా మెరుగుపరుచుకోవాలని మధన పడుతున్నారు. కాగా.... ఈనెల19న జగన్ అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్యెల్యేలు, పార్టీ నియోజకవర్గ బాధ్యలు, సమన్వయ కర్తలతో సమావేశం కానున్నారు.
ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్టు తెప్పించుకుంటున్న ఏపీ సీఎం జగన్... ఆ నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలకు గ్రేడింగులు ఇచ్చి క్లాస్ పీకే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏదేమైనా ఈ సారి పార్టీ ఇంచార్జులను మార్చేసి... టికెట్ల పంపకాలు చేపడితేనే బాగుంటుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.