Kurasala Kanna Babu: ఆయనను అవమానించినప్పుడు పవన్‌ ఎక్కడ.. ఇప్పటికైనా కళ్లు తెరవాలి

Update: 2020-06-27 13:27 GMT

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు వ్యవసాయ శాఖ మంత్రి కురుసాల కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. కాపు నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై దృష్టి మరల్చడానికే పాలకులు తెలివిగా కాపు కార్పొరేషన్‌ ను ఏర్పాటు చేశారన్నని నిన్న పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కురుసాల కన్నబాబు స్పందించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకంపై పవన్‌ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మంత్రి కన్నబాబు శనివారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గతంలో ముద్రగడ పద్మనాభం కాపుల కోసం ఉద్యమం చేస్తే చంద్రబాబు అణచివేశారనీ..ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు ప్రభత్వం అవమానించినప్పుడు పవన్‌ ఎక్కడున్నారు?. చంద్రబాబు హయాంలో పవన్‌కు కళ్లు కనిపించలేదా అని ప్రశ్నించారు. కాపులను మోసం చేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని కన్నబాబు నిలదీశారు. పవన్‌ కుల ప్రస్తావన లేకుండా రాజకీయాలు చేయలేకపోతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్‌ ప్రభుత్వం కాపులకు అండగా నిలిచిందనీ.. కాపు నేస్తం పథకం కింద మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తామనీ చెప్పారు. తమ ప్రభుత్వంపై పవన్‌కు ఎందుకంత ఉక్రోషం అని ప్రశ్నించారు. ఏడాది కాలంలో కాపులకు 4,769 కోట్ల రూపాయలు ఆర్ధిక సాయం అందించామని మంత్రి వెల్లడించారు.తమ ప్రభుత్వం చేస్తున్న మంచి చూసి ఓర్వలేనితనంతోనే పవన్ అర్థం లేని విమర్శలు చేస్తున్నారనీ మండిపడ్డారు. చంద్రబాబు పట్ల తన ప్రేమను పవన్ దాచుకోలేకపోతున్నారనీ ఎద్దేవా చేశారు. విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయడం సిగ్గుచేటుని.. కాపులకు ఎవరు మేలు చేశారో ఇప్పటికైనా పవన్‌ తెలుసుకోవాలి అని మంత్రి కన్నబాబు హితవు పలికారు.

Tags:    

Similar News