Andhra Pradesh: మున్సిపాలిటీలకు కాసుల వర్షం

Andhra Pradesh: *ఇంటి పన్ను కడితే 5శాతం రాయితీ *ఏప్రిల్ 1 నుంచి 30వరకు డిస్కౌంట్

Update: 2022-05-05 04:00 GMT

Andhra Pradesh: మున్సిపాలిటీలకు కాసుల వర్షం

Andhra Pradesh: ఏపీలో పురపాలక, పట్టణాభివృద్ధి విభాగం ఈ ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్‌లో ప్రకటించిన ఆస్తి పన్నుపై ఐదు శాతం తగ్గింపు అవకాశాన్ని పుర ప్రజలు అనూహ్యంగా వినియోగించుకున్నారు. పన్నుల వసూలు కోసం ప్రభుత్వం అదిలించి బెదిరించి కొన్నిసార్లు నోటీసులిచ్చినా ఫలితం రాకపోవడంతో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ లోపు కట్టేస్తే పన్నులో ఐదు శాతం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇంకే‌ముంది ఆఫర్లకు ఆకర్షితులయ్యే జనం ఈ ఆఫర్ ను బాగా వినియోగించుకున్నారు. వేలం వెర్రిగా ఎగబటడ్డారు. యేళ్ళ తరబడి బకాయిలున్న పన్నులను కట్టి కార్పొరేషన్, మున్సిపాలిటీలకు కాసులు కుమ్మరించి ఖజానాను నింపారు. ఈ ఆఫర్లతో టార్గెట్ ను మించి రీచయ్యారు అధికారులు.

ఏప్రిల్లోనే ఆస్తిపన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ పొందవచ్చన్న ప్రభుత్వ ప్రకటనకు అపూర్వ స్పందన వచ్చింది. తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట, పుత్తూరు, వెంకటగిరి, చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరిలో లక్ష్యానికి మించి వసూలైంది. తిరుపతి జిల్లాలో ఏడు పురపాలక సంఘాల పరిధిలో ఏప్రిల్లో ఆస్తిపన్ను 10.47 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించగా ఏడు ప్రాంతాల్లో కలిపి 18.45 కోట్లు వసూలైంది. చిత్తూరు జిల్లా పరిధిలోని ఐదు పురపాలక సంఘాల్లో 7.36 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకోగా 8.70 కోట్ల రూపాయలు వసూలు చేశారు. తిరుపతి జిల్లాలో తిరుపతి నగర పాలక సంస్థ 5.71 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకోగా ఆఫర్ మూలాన 13.88 కోట్ల రూపాయలు వసూలైంది. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 1.01 కోట్ల రూపాయలు లక్ష్యం పెట్టుకుంటే 1.57 కోట్ల రూపాయలు జమైంది.‌

ఇక సూళ్లూరుపేట మున్సిపాలిటీ నుంచి 68 లక్షల రూపాయల టార్గెట్ పెట్టుకుంటే 91లక్షల రూపాయలు వసూలు చేసారు. నాయుడుపేట మున్సిపాలిటీ లో 46 లక్షల రూపాయలు అంచనా వేయగా 68 లక్షల రూపాయలు ప్రజలు పన్నులు కట్టారు. ఒక్క గూడూరు మున్సిపాలిటీ మాత్రమే 2.06 లక్షలు లక్ష్యం పెట్టుకుంటే 68 లక్షల రూపాయలు వచ్చాయి. ఎప్పుడూ పన్నుల వసూళ్ళలో మందగమనంలో ఉండే పుత్తూరు మున్సిపాటికీ కూడా లక్ష్యాన్ని అధిగమించింది. 30 లక్షల టార్గెట్ కాగా 38 లక్షలు రాబట్టారు. వెంకటగిరి మున్సిపాలిటీ 24 లక్షలు లక్ష్యం అయితే 34 లక్షల రూపాయలు జమయ్యాయని తిరుపతి మేయర్ శిరీష్ తెలిపారు. 

Tags:    

Similar News