Andhra Pradesh Government: నీరు చెట్టు అక్రమాలపై హెకోర్టుకు ఏపీ ప్రభుత్వం...

Andhra Pradesh Government: గత ప్రభుత్వం చేసిన అవినీతి పనులను తవ్వేందుకు సీఎంగా జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పారు.

Update: 2020-09-02 01:17 GMT

 Andhra Pradesh | గత ప్రభుత్వం చేసిన అవినీతి పనులను తవ్వేందుకు సీఎంగా జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పారు. దానికి అనుగుణంగా ఇప్పటికే రివర్స్ టెండరింగ్, పీపీపీ విధానాలపై సమీక్ష వంటి పనులను చేపట్టారు. దీనిలో భాగంగా భారీ అవినీతి జరిగిన నీరు - చెట్టులో నిగ్గు తేల్చాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టును ఆశ్రయించింది.

గత ప్రభుత్వంలో నీరు–చెట్టు పథకం కింద జరిగిన పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. పనులు చేయకుండానే చేసినట్లు, 50 శాతం పనులు చేసి 100 శాతం పనులు చేసినట్లు కాంట్రాక్టర్లు తప్పుడు లెక్కలు చూపారని వివరించింది. నీరు–చెట్టు కింద జరిగిన పనులన్నింటిపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఆదేశించామని తెలిపింది.

► విజిలెన్స్‌ విచారణ నేపథ్యంలోనే చెల్లింపులన్నింటినీ నిలిపేశామంది. విజిలెన్స్‌ విచారణ జరుగుతున్నందున పిటిషన్లపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేయాలని హైకోర్టును అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది.

► ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజనీ ఉత్తర్వులు జారీ చేశారు. నీరు–చెట్టు కింద పనులను పూర్తి చేసినప్పటికీ తమకు చెల్లించాల్సిన మొత్తాలను ప్రభుత్వం ఆపేసిందంటూ కృష్ణా జిల్లాకు చెందిన ప్రసాదరావు, శ్రీధర్, మరికొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

► ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ రజనీ మంగళవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. కాంట్రాక్టర్లతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని తెలిపారు. విజిలెన్స్‌ విచారణలో అన్నీ తేలతాయన్నారు.

Tags:    

Similar News