Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బార్ పాలసీ ప్రకటన – పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా బార్ పాలసీని ప్రకటించింది. లైసెన్స్ ఫీజులు, షాపుల కేటాయింపు విధానం, పని వేళలు తదితర అంశాల్లో కీలక మార్పులు చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్‌కుమార్ మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 840 బార్లు ఉన్నాయి. వీటిలో 10 శాతం బార్లను కల్లుగీత కార్మికులకు కేటాయించనున్నట్లు తెలిపారు. కొత్త వారూ మద్యం వ్యాపారంలోకి ప్రవేశించేలా పలు సడలింపులు ఇచ్చారు. గతంలో బార్ లైసెన్స్ పొందడానికి ముందే రెస్టారెంట్ లైసెన్స్ ఉండాలని నిబంధన ఉండేది. అయితే ఇకపై బార్ లైసెన్స్ తీసుకున్న తర్వాత 15 రోజుల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు.
లైసెన్స్ ఫీజులను కూడా గణనీయంగా తగ్గించారు. 70 శాతం నుంచి 50 శాతానికి తగ్గినట్లు వెల్లడించారు. కొత్త ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి:
50 వేల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో – ₹35 లక్షలు
50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో – ₹55 లక్షలు
5 లక్షల పైగా జనాభా ఉన్న నగరాల్లో – ₹75 లక్షలు
ప్రతి ఏడాది 10 శాతం చొప్పున ఫీజులు పెరుగుతాయని తెలిపారు. ఇకపై లైసెన్స్ ఫీజును ఒకేసారి కాకుండా ఆరు విడతలుగా చెల్లించే అవకాశం కల్పించారు.
బార్ పని వేళల్లో కూడా మార్పులు చేశారు. ఇప్పటి వరకు ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి ఉండేది. ఇకపై ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు తెరవొచ్చని తెలిపారు. అన్ని కేటగిరీలకూ దరఖాస్తు ఫీజును ₹5 లక్షలుగా నిర్ణయించారు.
దరఖాస్తులు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. ఆగస్టు 28న కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి బార్లను పారదర్శకంగా కేటాయిస్తారు. కొత్త పాలసీ సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.