ఏపీలో మరో కొత్త పథకం

Update: 2020-12-10 05:36 GMT

ఏపీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. ఇవాళ జగనన్న జీవ క్రాంతిని సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18 వందల 69 కోట్ల వ్యయం తో దాదాపు రెండున్నర లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో యూనిట్‌లో 5 నుంచి 6 నెలల వయసున్న 14 గొర్రెలు పంపిణీ చేయనున్నారు. సెర్ఫ్‌ సాయంతో నచ్చిన గొర్రెలు, మేకలను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఒక్కో యూనిట్‌ ఖరీదును రవాణా, బీమా ఖర్చు కలుపుకుని రూ.75,000 గా నిర్ణయించారు.

తక్కువ శ్రమ, పెట్టుబడితో మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకోవడమే లక్ష్యంగా జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంబిస్తోంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా గొర్రెలు, మేకల పెంపకానికి ఆసక్తి కనపర్చిన మహిళలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయం, బ్యాంకు రుణం కల్పించాలని నిర్ణయించింది. 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు ఈ రుణ సదుపాయం కల్పించనుంది. బుణంలో అసలు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేస్తూ రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెల, మేకల యూనిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఒక్కో లబ్దిదారునికి ఒక యూనిట్‌ మాత్రమే పంపిణీ చేయనుండగా మూడేళ్లలో ఒక కుటుంబానికి దాదాపు లక్షా 29 వేలు ఆదాయం చేకూరనుంది.

ఈ పథకం తొలివిడతలో భాగంగా మార్చి 2021 వరకు 20వేల యూనిట్లు, రెండవ విడతలో ఏప్రిల్‌ 2021 నుంచి ఆగష్టు 2021 వరకు లక్షా 30 వేల యూనిట్లు, మూడవ విడతతో సెప్టెంబరు 2021 నుంచి డిసెంబరు 2021 వరకు 99 వేల యూనిట్లు పంపిణీ చేయనున్నారు. అవగాహన–శిక్షణ పథకంలో ఎంపికైన మహిళా లబ్ధిదారులకు గొర్రెలు, మేకల యూనిట్ల కొనుగోలుకు ముందే మేలు రకమైన జాతి, యూనిట్‌ సైజు, ఖరీదు, ఎంపిక చేసుకునే విధానం, కొనుగోలు చేసే ప్రాంతం, రవాణా, బీమా సౌకర్యం లాంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో శిక్షణా కేంద్రాలను నెలకొల్పేందుకు నిర్ణయించింది ప్రబుత్వం.

Tags:    

Similar News