YSR Matsyakara Bharosa: మత్స్యకారులందరికీ అందని భరోసా

YSR Matsyakara Bharosa: సముద్ర గర్భంలో పోరాటం చేపల వేటకై ఆరాటం.

Update: 2021-06-09 10:35 GMT

YSR Matsyakara Bharosa: మత్స్యకారులందరికీ అందని భరోసా

YSR Matsyakara Bharosa: సముద్ర గర్భంలో పోరాటం చేపల వేటకై ఆరాటం. బోటు కదిలితేనే కడుపుకు అన్నం దొరుకుతుంది. వల విసిరితేనే రోజులు గడుస్తాయి. లేదంటే పస్తులు, అవస్థలు తప్పవు. కానీ ప్రతి ఏడాది భారత ప్రభుత్వం రెండు నెలలు చేపల వేటను నిషేధిస్తోంది. ఆ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులే దిక్కు. ఆ భరోసాతోనే బతుకీడుస్తారు. ఏపీ ప్రభుత్వం జగనన్న మత్స్యకార భరోసా కింద గతేడాది 10 వేల రూపాయల సాయం చేసింది. కానీ ఈసారి అధికారుల అలసత్వం భరోసాకు బ్రేకులు వేసింది. లబ్ధిదారులకు మొండీచేయి చూపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో భరోసా అందక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలపై హెచ్‌‍ఎంటీవీ స్పెషల్‌ స్టోరీ.

శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. 12 మండలాలు సముద్ర ఒడ్డు వెంబడే ఉన్నాయి. అందులో 104 గ్రామాల్లో లక్షా 40 వేల మంది చేపల వేటతో జీవనం సాగిస్తున్నారు. సముద్రంలోకి వెళ్తేనే వీరి కడుపులోకి అన్నం వెళ్తుంది. ఒక్క రోజు వేటకు వెళ్లకున్నా పస్తులు తప్పవు. కానీ ఏడాదిలో రెండు నెలల పాటు చేపల వేట నిషేధం ఉంటుంది. ఆ రెండు మాసాల్లో మత్స్యకారులకు పూట గడవడమే కష్టమవుతోంది. అయితే గత రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు 4వేల సాయం అందించేంది. కానీ జగన్‌ పాలనలో వీరికి 10వేల ఆర్థిక సాయం అందుతుంది.

కానీ శ్రీకాకుళం జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా లబ్ధిదారులకు ప్రభుత్వ భరోసా అందని ద్రాక్షగా మారింది. ఇచ్చాపురం, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన మత్స్యకారులు భరోసా అందక నిరసన చేపట్టారు. జగన్న మత్స్యకార భరోసా పేరుతో సాయాన్ని పెంచారు. కానీ లబ్ధిదారులపై ఆంక్షాల వల విసిరారు. 21 ఏళ్లు నిండినవారికి మాత్రమే భరోసా అందుతుందని అధికారులు అంటున్నారు. రేషన్ కార్డులో ఉన్నవారందరికీ భరోసా అందదని ఒకరికి మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు ఒక బోటులో ఒకరికే మాత్రమే భరోసాకు అర్హులను చెబుతున్నారు. దీంతో మత్స్యకారుల్లో అలజడి మొదలైంది.

ఇన్ని కొర్రిలు పెట్టడంతో జిల్లాలో 50 శాతం మందికి నిరాశ మిగిలింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. 18 ఏళ్లు నిండిన మత్స్యకారులకు సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మావి. వేట నిషేధ కాలంలో ఎలా బతకాలని మహిళలు మండిపడుతున్నారు. నిషేధ కాలంలో పక్క రాష్ట్రాలకు వెళ్లే మత్స్యకారులు కరోనా భయంతో ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇప్పుడు ఎలా తినాలని ఆవేదన చెందుతున్నారు. లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులది. ఆ అధికారులే నిర్లక్ష్యం చేస్తే ఆకలి కేకలు మిన్నంటుతాయి. ఇప్పటికైనా అధికారులు ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించి, భరోసా కల్పించాలని మత్స్యకారులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News