మంగళగిరి ఎయిమ్స్‌లో 30 లక్షల ఓపీ సేవలు
మంగళగిరిలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో ఇప్పటి వరకు 30 లక్షల మంది ఔట్ పేషెట్ల(ఓపీ)కు వైద్యం అందించారు.
మంగళగిరి: మంగళగిరిలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో ఇప్పటి వరకు 30 లక్షల మంది ఔట్ పేషెట్ల(ఓపీ)కు వైద్యం అందించారు. ఈ ఎయిమ్స్ చరిత్రలో ఇది ఓ రికార్డ్. నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ మంగళగిరి ఎయిమ్స్ ఈ ఘనత సాధించినట్లు ఎయిమ్స్ ఈరోజు గర్వంగా ప్రకటించింది. రోగి సంరక్షణ సేవలు ప్రారంభించినప్పటి నుండి 30 లక్షల (3 మిలియన్లు) అవుట్ పేషెంట్ విభాగం (ఓపి) వైద్య సేవలు అందించినట్లు తెలిపింది. గత ఆరు నెలల్లోనే 5 లక్షల మంది రోగులకు వైద్యసేవలు అందించినట్లు వివరించింది. రోగులలో ఎయిమ్స్ పట్ల పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనంగా పేర్కొంది. సంస్థలో సేవల సామర్థ్యం విస్తరించినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తోపాటు పొరుగు ప్రాంతాల వారికి కూడా ఎయిమ్స్ అందుబాటులో ఉండి, తక్కువ ఫీజులతో అధిక-నాణ్యత గల ఆరోగ్య సంరక్షణ కల్పించినట్లు వివరించింది. మంగళగిరి ఎయిమ్స్ దృఢమైన నిబద్ధతను ఈ విజయం నొక్కి చెబుతుందని తెలిపింది.
సంవత్సరాలుగా, ఈ సంస్థ కరుణతో కూడిన మార్గంలో అత్యాధునిక వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపింది. నమ్మకమైన వైద్య నైపుణ్య కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ గర్వకారణమైన క్షణాన్ని అందరితో పంచుకుంటున్నట్లు పేర్కొంది. ప్రజారోగ్యం పట్ల అచంచలమైన అంకితభావంతో ఎయిమ్స్ సేవలు కొనసాగించాలనే లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తుందని తెలపింది. ఈ ప్రయాణంలో నిరంతర విశ్వాసం ప్రకటించి, మద్దతు ఇచ్చినందుకు ప్రతి రోగి, సంరక్షకుడు, భాగస్వాములకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.