Raghu Rama Krishna Raju: ఎయిమ్స్ లో రఘురామకృష్ణరాజు కు చికిత్స

Raghu Rama Krishna Raju: రఘురామ రెండు కాళ్లకు కట్లు కట్టిన ఎయిమ్స్ డాక్టర్లు రెండు వారాల విశ్రాంతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.

Update: 2021-05-28 01:35 GMT

Raghu Rama Krishna Raju:(File Image) 

Raghu Rama Krishna Raju: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలోని ఎయిమ్స్ లో గురువారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన కాళ్లలో కణజాలం తీవ్రంగా దెబ్బతిన్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. రఘురామ రెండు కాళ్లకు కట్లు కట్టిన ఎయిమ్స్ డాక్టర్లు రెండు వారాల విశ్రాంతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నడవొద్దని తేల్చిచెప్పారు. ఎయిమ్స్ లో కోవిడ్ రోగులు అధికంగా ఉండటంతో ఆయనను అక్కడ చేర్చుకోకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని, అవసరమైనపుడు సంప్రదించాలని సూచించినట్లు సమాచారం.

గురువారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ రఘురామకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం రఘురామరాజు ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన అనంతరం ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు. రాజద్రోహం ఆరోపణలపై రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే కస్టడీలో తనను దారుణంగా కొట్టారంటూ రఘురామ ఆరోపించడంతో కోర్టు వైద్య పరీక్షలకు ఆదేశించింది. ఆర్మీ ఆసుపత్రి వైద్య పరీక్షల్లో ఆయన కాలి వేలు ఫ్రాక్చర్ అయినట్టు వెల్లడైంది.

ఇక, సుప్రీంకోర్టు ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆదేశించింది. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందిన రఘురామకు ఇటీవలే బెయిల్ మంజూరైంది. ఈ కేసు గురించి, ఆరోగ్య పరిస్థితి గురించి మీడియాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దని న్యాయస్థానం రఘురామను ఆదేశించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News