మొన్న మదనపల్లె.. ఇవాళ చాట్లమడ.. దేవుడి పేరుతో ఊపిరి తీసుకుంటున్నారు.. శివుడు పిలుస్తున్నాడని..

Andhra Pradesh: తరాలు మారుతున్నా.. కొందరి ఆలోచనలు మాత్రం గతకాలపు మూలాల్లోనే మగ్గిపోతున్నాయి.

Update: 2022-09-27 05:30 GMT

మొన్న మదనపల్లె.. ఇవాళ చాట్లమడ.. దేవుడి పేరుతో ఊపిరి తీసుకుంటున్నారు.. శివుడు పిలుస్తున్నాడని..

Andhra Pradesh: తరాలు మారుతున్నా.. కొందరి ఆలోచనలు మాత్రం గతకాలపు మూలాల్లోనే మగ్గిపోతున్నాయి. శాస్త్రసాంకేతిక రంగాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నా.. మూఢ విశ్వాసాలను వదలనంటున్నాయి. దేవుడు పిలుస్తున్నాడని కొందరు.. ఆయన దగ్గరకు వెళ్తున్నామంటూ మరికొందరు.. జీవిత ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. వందేళ్ల ఆయుష్షుకు అర్థం లేకుండా చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చాట్లమడలో ఓ వ్యక్తి శివుడు పిలుస్తున్నాడంటూ ఆత్మహత్య చేసుకోవడం మనుషుల్లో పేరుకుపోతున్న అజ్ఞానపు అంధకారాలను గుర్తు చేస్తున్నాయి.

దేవుడున్నాడా..? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనిషి ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. ఇప్పటివరకు ఎవరూ చెప్పలేకపోయారు. కానీ ఆ కనిపించని దేవుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. దేవుడి పేరుతో ఏకంగా ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చాట్లమడలో ఓ వ్యక్తి ఆత్మహత్య ఘటన మనుషుల్లో పేరుకుపోయిన మూఢ విశ్వాసాలను గుర్తు చేసింది. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న వెంకట పూర్ణ శేఖర్‌రెడ్డి అనే వ్యక్తి అకస్మాత్తుగా సొంతూరు చాట్లమడకు వచ్చాడు. అంతలోనే ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఊహించని ఘటన కుటుంబ సభ్యులను కన్నీటి సంద్రంలోకి ముంచేసింది. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషిస్తూ రాసిన సూసైడ్ లెటర్‌ ను చదివి నిర్ఘాంతపోయారు. తనను శివుడు పిలుస్తున్నాడని అందుకే వెళ్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. తానేమీ అజ్ఞానంతో వెళ్లడం లేదని చాలా ధైర్యం కలవాడినంటూ రాసుకొచ్చాడు. పై లోకంలో శివుడికి సేవ చేస్తూ ఉంటానని తన తండ్రి కూడా శివుడి సేవలోనే ఉన్నాడని చెప్పుకొచ్చాడు. మళ్లీ జన్మలో తనను సమాజానికి సేవ చేసేలా పుట్టిస్తానని దేవుడు చెప్పినట్లు లెటర్‌లో శేఖర్‌ రెడ్డి పేర్కొన్నాడు. ఈ చెడు సమాజంలో ఒక్క క్షణం ఉన్నా గుండె పగిలిపోతుందంటూ తన ఆవేదనను వెళ్లగక్కాడు.

వాస్తవానికి ఇది ఒక్క శేఖర్‌రెడ్డికి సంబంధించిందే కాదు. మనచుట్టూ ఉన్న సమాజంలో చాలామంది శేఖర్‌రెడ్డిలు ఉన్నారు. పైకి పూజలు చేస్తూ, భక్తులుగా కనిపిస్తున్నా లోన ఏదో తెలియని లేదా వారికి మాత్రమే అర్థమయ్యే అగాధాన్ని మోస్తూ ఉంటారు. విపరీతమైన ఆలోచనలతో అతిగా ప్రవర్తిస్తుంటారు. ఈ ఉదంతం చూశాక సరిగ్గా యేడాదిన్నర క్రితం చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన జంట హత్యల కేసు గుర్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రులే కన్నబిడ్డలను అత్యంత కర్కషంగా చంపేసిన ఘటన కళ్లముందు కదలాడుతోంది. ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు పరిధి దాటిన ఆధ్యాత్మిక ఆలోచనలతో సొంత బిడ్డలను దారుణంగా చంపేశారు. శూలంతో పొడిచి ఒకరిని, నోటిలో రాగి చెంబును పెట్టి దాన్ని డంబెల్‌తో బాది మరొకరని చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆ సమయంలో తల్లిదండ్రులు చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. తాము పార్వతీ పరమేశ్వరులని త్వరలోనే కొత్త లోకాన్ని సృష్టిస్తామని చెప్పారు. ప్రాణాలు పోయిన ఇద్దరు కూతుళ్లు మరికొన్ని గంటల్లోనే తిరిగి లేస్తారని అది సృష్టి రహస్యం అని చెప్పడాన్ని బట్టి వారి ఆలోచన స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మితిమీరిన ఆధ్యాత్మిక ఆలోచనలు మనుషులను ఎంతలా ప్రభావితం చేస్తాయో వీరిని చూస్తే అర్థం అవుతుంది.

ఈ రెండు ఘటనలను విశ్లేషిస్తే నిజంగా పూజలు చేసే వారికి దేవుడు కనిపిస్తాడా..? అలాంటి వారికి డైరెక్షన్‌ ఇస్తుంటాడా..? సైకియాట్రిస్టుల విశ్లేషణ ప్రకారం ఇదంతా మెదడు పనితీరుపై ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు. మనం ఏది ఆలోచిస్తే చివరకు అలానే మారిపోతామని అంటారు. ఒక్కసారి దేవుడిని ఆరాధించడం మొదలుపెడితే ఇక వాటికి సంబంధించిన ఆలోచణలు ప్రవాహంలా వస్తుంటాయి. వాటికి అంతు అంటూ ఉండదు. అలా ఆలోచనలు ఓ స్థాయి దాటితే మనలో తెలియని మార్పులు చోటు చేసుకుంటాయి. కొద్దిరోజుల్లోనే తనలో తాను మాట్లాడుకుంటూ దేవుడితో సంభాషిస్తున్నట్లు ప్రవర్తిస్తారు. మిగతావారు నమ్మరు కాబట్టి ఈ విషయాలను ఎవరితోనూ పంచుకోడానికి ఇష్టపడరు.

దేవుడిని కొలిచే సాధనమే భక్తి అంటారు. కానీ అలాంటి భక్తి మితిమీరితే అవి హద్దులు దాటితే అప్పుడే ఇలాంటి ప్రవర్తన బయట పడుతుందంటారు. భక్తిలో మునిగిన చాలామందికి ఈ సమాజం నచ్చదు. దీన్ని బాగుచేయాలని అనుకుంటారు. అర్హతకు మించిన ఆలోచనలతో మెదడును నింపుకుంటారు. అందుకు తమకు తెలిసిన ప్రయత్నాలు కూడా చేస్తారు. అది సాధ్యం కాక తమలో తాము కుమిలిపోతుంటారు. అలాంటి సమయంలో వారి ప్రవర్తన కొత్తగా కనిపిస్తుంది. ఈ మార్పు ఒక్కరోజులో వచ్చేది కాదు. క్రమక్రమంగా వారిలో ఇలాంటి భావాలు పేరుకుపోతాయి. చాలాకాలం తర్వాత అవన్నీ ఒక్కసారిగా బరస్ట్‌ అవుతారు. దానికి పరాకాష్టే ఇలాంటి ఘటనలు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు అవసరం అంటున్నారు మానసిక విశ్లేషకులు. తనలో కానీ తన కుటుంబ సభ్యుల్లో కానీ ఇలాంటి ప్రవర్తన గుర్తిస్తే వెంటనే సైకియాట్రిస్టులకు చూపించాలని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్టేజ్‌ నుంచే వారిని కాపాడుకోవచ్చని వివరిస్తున్నారు. 



Tags:    

Similar News