Srikakulam: ఒకప్పుడు కరోనా రహిత జిల్లాగా శ్రీకాకుళం

Srikakulam: ప్రస్తుతం 100కుపైగా రోజువారీ కేసులు నమోదు * ప్రజల నిర్లక్ష్యం, అలసత్వం, విచ్చలవిడితనం కారణం

Update: 2021-08-11 03:50 GMT

Representational Image

Srikakulam: కరోనా మహమ్మారితో ప్రపంచమంతా విలవిలలాడుతోంది. కానీ.. ఆ ఒక్క జిల్లాను మాత్రం కరోనా పురుగు టార్గెట్‌ చేయలేకపోయింది. ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కరోనా ఫ్రీ జిల్లాగా పేరొందింది. అయితే అక్కడి ప్రజల నిర్లక్ష్యం, మాకేం కాదులే అన్న ధీమా ఇప్పుడు ఆ జిల్లా కొంప ముంచింది. శ్రీకాకుళం జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు జిల్లాలో జీరో కేసులు ఉండేవి. కానీ ప్రజల అలసత్వం, విచ్చలవిడి కారణంగా రోజువారీ కేసుల సంఖ్య 100కు పైగా పెరిగింది.

కరోనా నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు సిక్కోలు ప్రజలు. ఎక్కడ చూసినా గుంపులు, గుంపులు జనం. మాస్క్‌ లేకుండానే వాహనాలపై ప్రయాణాలు. రద్దీ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరగడం. టీకా తీసుకున్నాం కదా ఆ వైరస్‌ మమ్మల్ని ఏం చేస్తుందనే నిర్లక్ష్యం.. ఇప్పుడు అక్కడి ప్రజలకు కంటిమీదకునుకు లేకుండా చేస్తోంది. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. రోజువారీ కేసుల సంఖ్య 50 నుంచి ఒక్కసారిగా 100కు పెరిగింది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 74వేల 533 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

టెక్కలి పట్టణంలో మూడ్రోజుల క్రితం ఒకే ఇంట్లో నివసిస్తున్న వారందరికీ కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఉన్నట్టుండి కేసులు విపరీతంగా పెరగడానికి కారణమేంటని ఆరా తీయగా.. రోడ్లపై జనం గుమిగూడటం, మాస్క్‌ లేకుండానే ఇష్టానుసారంగా తిరగడమని తేలింది. ఒక్కరంటే ఒక్కరు కూడా కరోనా నిబంధనలు పాటించడం లేదు. దీంతో ప్రజల తీరుపై వైద్యారోగ్యశాఖ అధికారి చంద్రనాయక్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఓ పక్క కరోనా ఇంకా పూర్తిగా అంతం కాలేదని, మన జాగ్రత్తలో మనం ఉండాలని అవగాహన కల్పిస్తుంటే.. ప్రజలు మాత్రం వాటిని లెక్కచేయకుండా ఇలా మాస్క్‌లు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపై తిరగడం కరెక్ట్‌ కాదని కొందరు సీనియర్‌ సిటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకూడదని పలువురు సూచిస్తున్నారు.

కరోనా సెకండ్‌వేవ్‌ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే థర్డ్‌వేవ్‌ వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే.. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. 

Tags:    

Similar News