AP News: తల్లి కోసం జైలు గేటును తట్టిన ఏడేళ్ళ చిన్నారి.. అమ్మా నిను చూడాలి అంటూ ఆవేదన..
AP News: జైలు గోడలకు అవతల తల్లి.. ఇవతలి వైపు కూతురు
AP News: తల్లి కోసం జైలు గేటును తట్టిన ఏడేళ్ళ చిన్నారి.. అమ్మా నిను చూడాలి అంటూ ఆవేదన..
AP News: ఇక్కడ ఏడుస్తున్న చిన్నారిని చూశారు కదా.. ఈ చిన్నారిని చూస్తుంటే ఏమనిపిస్తుంది..? స్కూల్లో వదిలి పెడితే ఇంటికి వెళ్ళి పోతానంటూ మారాం చేస్తున్న చిన్నారిలా కనిపిస్తోంది కదూ.. లేదంటే చిన్నారిని గదిలో అక్రమంగా బంధించారని అనుకుంటున్నారా..? అది కూడా కాదు..సీన్ చూస్తుంటే పాపం పసివాడు సినిమాలో అడవిలో తప్పిపోయిన బాలుడు తల్లిని చూడాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నట్లు కనిపిస్తోంది కదా.. అవును నిజం ఈ చిన్నారి వెక్కి వెక్కి ఏడుస్తోంది మాత్రం తల్లి కోసమే.. కానీ స్కూల్లోనో.. అడవిలో కాదు..
చిన్నారి ఏడుస్తూ.. హృదయ విదారకంగా కనిపిస్తోంది ఎక్కడ అనుకుంటున్నారా.. కరడు గట్టిన నేరస్తులను బంధించిన ఒక జైలు గేటు దగ్గర. తన తల్లి కోసం జైలు గేటును బద్దలు కొట్టాలన్నంత కసి ఉన్నా ఏమీ చేయలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తన తల్లి ఇక కనిపిస్తుందా లేదా.. తన ఆలనా పాలన ఇకపై ఎవరు చూస్తారు..? అస్సలు తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియక దిక్కుతోచని స్థితిలో అమ్మీ.. అమ్మీ అని ఏడుస్తూ కనిపించిన చిన్నారి దీన స్థితిని చూసి స్థానికులు చలించి పోయారు.
ఈచిన్నారిని తల్లి నుంచి విడదీశాయి జైలు గోడలు.. తల్లి ప్రేమకు దూరం చేశాయి జైలు ఊచలు.. తన తల్లిని ఒక్కసారైనా చూడాలి.. కొద్ది సేపైనా మాట్లాడాలి అని ఆవేదన వెళ్ళబోసుకుంటున్న ఈ చిన్నారి తల్లి గేటుకు అవతల ఉన్న జైలులో బందీగా ఉంది. గొంతు తడి ఆరిపోయేలా చిన్నారి విలపిస్తున్న ఈ దృశ్యం కర్నూలు రూరల్ తహశీల్దారు కార్యాలయం ప్రాంగణంలోని మహిళా సబ్ జైలు ఎదుట కనిపించింది.
కర్నూలు పాతనగరానికి చెందిన ఓ మహిళను దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను మహిళా జైలుకు తరలించారు. ఇదంతా రూల్ ప్రకారం పోలీసులు తమ పని తాము చేసుకు పోయారు. అయితే ఆ తల్లి ఏ తప్పు చేసిందో ఆ చిన్నారికి తెలియదు.. ఆమె చేసిన నేరం ఏంటో ఆలోచించే వయస్సు కూడా, ఆలోచనా శక్తి ఆ బాలికకు లేదు. కేవలం అమ్మ దూరమైందన్న ఆవేదన.. చిన్నారిని జైలు గేటును తట్టేలా చేసింది. తల్లిని ఎలాగైనా చూడాలన్న ఆరాటం అక్కడే ఉండిపోయేలా చేసింది.
చిన్నారి ఆవేదనను చూసి చలించి పోయిన స్థానికులు కొంత మంది జైలు అధికారులను కలిసి బాలికను తల్లితో కలిపించాలని విజ్ఞప్తి చేశారు. జైలు అధికారులు ఆ తల్లిని మరోసారి బయటకు పిలిపించి కూతురితో ములాఖత్ ద్వారా కలిసేలా చర్యలు తీసుకున్నారు. అయినా బాలిక అక్కడి నుంచి వెళ్ళక పోవడంతో కూతురును కూడా లోపలికి తీసుకెళ్లింది. ఆ తర్వాత జైలు అధికారులు ఖైదీ బంధువులను జైలుకు పిలిపించి బాలికను ఇంటికి పంపడంతో కథ సుఖాంతమయ్యింది.. కానీ తల్లి కోసం బాలిక ఎదురు చూపులు ఎప్పుడు తీరేనో.