Amaravati: 900వ రోజుకు అమరావతి ఉద్యమ పోరాటం

Amaravati: 2019 డిసెంబరు 19న అమరావతి ఉద్యమం ప్రారంభం

Update: 2022-06-08 04:22 GMT

Amaravati: 900వ రోజుకు అమరావతి ఉద్యమ పోరాటం

Amaravati: అమరావతి పోరాటం మరో మైలురాయిని చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మూడు రాజధానుల మూడుముక్కలాటలో రాజధాని రైతులు సమిధలయ్యారు. ఆ భూముల్లో పనిచేసి బతికే రైతుకూలీలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు అందరూ ఒక్కటై నడిచిన పోరాటం నేడు 900వ రోజుకు చేరింది. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఈ సుదీర్ఘ ప్రజా ఉద్యమంలో ఆంక్షలు, నిర్బంధాలు, అక్రమ కేసులు, అరెస్టులు, పోలీసు కవాతులు, విరిగిన లాఠీలు ఇలా మరచిపోలేని ఘట్టాలెన్నో. అందుకే అజరామరమైన ఉద్యమంగా రాజధాని అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది.

రాష్ట్ర అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేయడంతో 2019 డిసెంబరు 19న అమరావతి ఉద్యమం మొలకెత్తింది. కష్టాలు, నష్టాలకోర్చి, కరోనా కాలాన్ని అధిగమించి 900వ రోజుకు చేరింది. అదే ఏడాది డిసెంబరు 20న రిలే నిరాహార దీక్షలతో మొదలైన ఉద్యమం 2020 జనవరి 5న తుళ్లూరు నుంచి మందడం వరకూ సాగిన 29 గ్రామాల రైతుల పాదయాత్రతో ఊపందుకుంది. విజయవాడ దుర్గమ్మకు ముడుపులు చెల్లించుకునేందుకు ఉద్యమంగా బయలుదేరిన మహిళలను ప్రకాశం బ్యారేజీ వద్ద పోలీసులు అడ్డుకుని లాఠీచార్జి చేశారు. దీంతో జనవరి 7న రైతులు, మహిళలంతా కలిసి హైవే దిగ్బంధనం చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని కేబినెట్‌ ఆమోదించడాన్ని నిరసిస్తూ జనవరి 20 చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీనిపై ప్రభుత్వం దమనకాండకు పాల్పడింది. కొండవద్దకు పాదయాత్ర, 29 గ్రామాల్లో బైక్‌ ర్యాలీ, కోటప్పకొండకు ర్యాలీ నిర్వహించి ఉద్యమాన్ని మరో అడుగు ముందుకు వేయించారు. సరిగ్గా ఇదే సమయంలో కరోనా కష్టకాలం మొదలయింది. అయినప్పటికీ రైతులు, మహిళలు వెనక్కి తగ్గలేదు. ఎవరి ఇళ్లలో వారు నిరసన దీక్షలు చేపట్టారు

ఉద్యమం మొదలైన 200వ రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా 250 పట్టణాల్లో సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించారు. 250వ రోజున 'నారీ సమరభేరి', 300వ రోజున 'రైతు భేరి', కౌళ్ల బకాయిల కోసం సీఆర్డీయే కార్యాలయం ముట్టడి, 2020 అక్టోబరు 31న 'జైల్‌ భరో' కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అరెస్టులయ్యారు. అదే ఏడాది డిసెంబరు 12న చావో.. రేవో.. కార్యక్రమం, డిసెంబరు 15న విజయవాడలో రైతు పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యమ నాయకులపై ఇప్పటి వరకూ 1100 అక్రమ కేసులు బనాయించింది. 3 వేల మందిని ఈ కేసుల్లో ఇరికించి భయభ్రాంతులకు గురి చేశారు. రాజధాని రైతులు, మహిళలు, దళితులు చరిత్రాత్మకమైన 'న్యాయస్థానం టూ దేవస్థానం' పేరిట హైకోర్టు నుంచి తిరుపతికి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 2021 నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకూ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రకు 13 జిల్లాల ప్రజల మద్ధతు లభించింది.

ప్రజలు అధికారం ఇస్తే పాలకులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని రాజధాని రైతులు పేర్కొన్నారు. రాజ్యాంగంలో లేని మూడు రాజధానులను తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు 900వ రోజుకు చేరుకున్నాయి. హైకోర్టు తీర్పును అమలు చేయాలని, ఒప్పందం ప్రకారం అమరావతి అభివృద్ధి జరగాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా కాలయాపన కోసం మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News