There is no space for ZP : అక్కడ జడ్పీ చీఫ్‌లకు నో ఎంట్రీ.!

There is no space for ZP : అక్కడ జడ్పీ చీఫ్‌లకు నో ఎంట్రీ.!
x
Highlights

There is no space for ZP : వాళ్లు జడ్పీ చైర్‌పర్సన్‌లు...వారివారి జిల్లాల్లో మంత్రితో సమానంగా తిరగొచ్చు కూడా కానీ, కనీసం వారి మండలంలో కూడా...

There is no space for ZP : వాళ్లు జడ్పీ చైర్‌పర్సన్‌లు...వారివారి జిల్లాల్లో మంత్రితో సమానంగా తిరగొచ్చు కూడా కానీ, కనీసం వారి మండలంలో కూడా తిరగలేకపోతున్నారట. తిరిగేందుకు స్వేచ్చ లేదట. ఆ జడ్పీ చైర్‌పర్సన్‌లకు ఎవరు టచ్‌లో ఉన్నా, ఎవరు ఆహ్వానించినా, ఆ క్యాడర్‌తో కట్ అట. ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులను వెలివేసినంత పని చేస్తున్నదెవరు..?ఇంతకీ ఆ ఎమ్మెల్యేలకు వారిద్దరిపై కోపం ఎందుకు...? మొక్కలోనే తుంచేస్తే బెటర్ అని భావిస్తున్నారా..? వారి ఆలోచనా తరంగాల గమనమేంటి?

వీరిద్దరూ జిల్లా పరిషత్ చైర్మన్లు. రాజకీయాల్లో లక్కుండి ఒక్కసారి జాక్‌పాట్ పదవులను కొట్టేసారు. దీన్ని బేస్ చేసుకుని ప్యూచర్ లో ఏదేని, సెగ్మెంట్ ను కోరుకుంటారో ఏమో కాని, ఇప్పుడు మాత్రం డైలమాలో పడ్డారు. జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎన్నికైన మొదట్లో ఆ ఆశ ఉందేమో కానీ, ఇప్పుడు మాత్రం బొత్తిగా లేదట. ఏందబ్బా అని ఆరాతీస్తే, వీరికి అప్పుడే చెక్ పెట్టే పనిలో ఉన్నారట లోకల్స్.

వరంగల్ రూరల్ జిల్లా జెడ్పి చైర్మన్ గా గండ్ర జ్యోతి బాధ్యతలు చేపట్టారు. భర్త భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. సతీమణి రాజకీయ రంగప్రవేశం కోసం, అందునా జిల్లా పరిషత్ పీఠం కోసం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. సరే, లోకల్ ఎమ్మెల్యేల డిమాండ్లను కాదని గండ్ర జ్యోతికి జడ్పీ పీఠాన్ని కట్టబెట్టారు. వరంగల్ రూరల్ జిల్లా కింద ఉన్న సెగ్మెంట్లలో వర్దన్నపేటకు ఎలాగూ పోలేరు. ఇక నర్సంపేటలో అడుగు పెట్టాలంటే అక్కడా సహాయ నిరాకరణే. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్న జడ్పీ పీఠం ఆశించి భంగపడ్డారు. వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని భుజానేసుకున్న తన భార్యను కాదని కాంగ్రెస్ నుంచి గండ్ర జ్యోతికి ఎలా ఇస్తారని పెద్ది దంపతులు ఇప్పటికీ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అందుకే నర్సంపేట సెగ్మెంట్ లో గండ్ర జ్యోతికి నో ఎంట్రీ అనేస్తున్నారట. ఎమ్మెల్యే పెద్దికి తెలియకుండా ఏ ఒక్కరూ గండ్ర జ్యోతిని కలిసినా ఊరుకునేది లేదన్నారట. ఆ సెగ్మెంట్‌లో ప్రోటోకాల్ ప్రకారం కనీసం ఫ్లెక్సీ కూడా కట్టే పరిస్థితి లేదు.

గండ్ర జ్యోతి స్వంత గడ్డ అయిన పరకాలలో, ఇంకో వెరైటీ సీన్. ఆమెను ఇప్పటి వరకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అడుగుపెట్టనివ్వడం లేదు. పరకాలలో తిరిగితే రేపు ఏకు మేకైతే ఎలా, అందుకే నో ఎంకరేజ్ అని ఎమ్మెల్యే చల్లా దర్మారెడ్డి క్యాడర్‌కు చెప్పేసారట. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సైతం, జిల్లా కలెక్టర్, మంత్రిని తప్ప ఇతరులను అడుగుపెట్టనివ్వకపోవడంతో, జడ్పీ చైర్మన్‌కు అక్కడ కూడా గేట్లు ఓపెన్ కావడం లేదట. దీంతో గండ్ర జ్యోతి తన భర్త నియోజకవర్గంలోని శాయంపేట మండలానికే పరిమితం అయ్యారు. అప్పుడప్పుడు తన భర్తతో భూపాలపల్లి సెగ్మెంట్‌కు వెళ్తే ఈ జిల్లాలో నీ పెత్తనం ఏంటనీ అక్కడి జడ్పి చైర్మన్ అంటున్నారట. దీంతో ఏం చెయ్యాలో తెలియని స్థితిలో గండ్ర కపుల్ ఉన్నారట. అధికారం ఉంది కదా అని పార్టీ మారినా లాబీయింగ్‌తో ఎలాగోలా జడ్పీ పీఠాన్ని దక్కించుకున్నా ఆ సంతోషమే లేదట.

ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహర్షినిది కూడా అదే పరిస్థితి. కాటారం మండలం జెడ్పిటిసిగా గెలుపొంది రిజర్వేషన్ అనుకూలించడం, భర్త రాకేష్ ఉద్యమకారుడు కావడంతో, జెడ్పి పీఠం దక్కింది. భూపాలపల్లి జెడ్పి చైర్మన్ స్థానం ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావడం, జిల్లాలో ఏకైక అధికార పార్టీ ఎస్సీ జెడ్పిటిసిగా గెలవడంతో అధిష్టానం కూడా మొగ్గు చూపి అవకాశం ఇచ్చింది. అయితే భూపాలపల్లి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలుపొంది టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన గండ్ర వెంకటరమణా రెడ్డి అక్కడ ఉన్నారు. తన నియోజకవర్గంలో తిరగాలన్నా, జిల్లా కేంద్రంలో సమావేశం పెట్టాలన్నా, తన అనుమతి తప్పనిసరి అంటున్నారట గండ్ర. దీంతో చేసేదేమీలేక, అధిష్టానంకు చెప్పుకోలేక నలిగిపోతున్నారట.

ఇదిలా ఉంటె జిల్లాలో మిగతా సగభాగం అటు మంథని నియోజకవర్గంలోని 6 మండలాలు ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. అక్కడైనా తిరుగుదాం అంటే పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం జిల్లా జెడ్పి చైర్మన్‌తో పాటు నియోజకవర్గం ఇంఛార్జిగా ఉన్నారు. తన పలుకుబడితో వచ్చి పోతుండటంతో అక్కడా తిరగలేక పోతున్నారట. అవకాశం వచ్చిందని సంబరపడాలో, అధికారం ఉన్నా తిరగలేకపోతుండటంతో బాధ పడాలో తెలియని అయోమయంలో ఉన్నారట శ్రీహర్షిని రాకేష్ యువ దంపతులు. రాజకీయ అరంగేట్రంలోనే మంచి అవకాశం వచ్చినా, ప్రజలకు సేవ చేయలేపోతున్నామని సతమతమైపోతున్నారని జిల్లాలో చర్చ సాగుతోంది.

మహిళా సాధికారతకు పాటు పడుతాం అని చెప్పడం తప్ప ఆచరణలో జరగడం లేదనడానికి, ఈ ఇద్దరు మహిళ జెడ్పి చైర్మన్‌లే ఉదాహరణ. భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లా జెడ్పి చైర్మన్ లకు పీఠం దక్కినా, పాలనా స్వేచ్ఛ దక్కడం లేదన్న ఆవేదనలో ఉన్నారు. ఎక్కడ తమకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ పోటీకి వస్తారోనని, స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు అభద్రతాభావానికి లోనుకావడం, ఈ మహిళా జడ్పీ చైర్మన్‌లకు ఇబ్బందిగా మారింది. అధిష్టానం దృష్టికి తీసుకెళితే ఏమైనా ఫలితం ఉంటుందా అని ఆలోచన చేస్తున్నారట. మరి హైకమాండ్ ఎటువైపు మొగ్గుచూపుతుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories