Tanuku: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలి.. కలెక్టర్
Tanuku: తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి, రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
Tanuku: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలి.. కలెక్టర్
తణుకు: ప్రభుత్వ ఆసుపత్రిలలో రోగులకు నాణ్యమైన, సత్వర వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. ఆదివారం తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రి పనితీరును పరిశీలించారు.
ఆసుపత్రిలోని అన్ని వార్డులను సందర్శించిన జిల్లా కలెక్టర్ చికిత్స పొందుతున్న రోగులను ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైద్య సేవల విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకురావాలని రోగులకు సూచించారు.
ఈ సందర్భంగా వైద్యులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, వైద్యులను సమాజం దేవుళ్లతో సమానంగా గౌరవిస్తుందని అన్నారు. అలాంటి గొప్ప బాధ్యతను నిర్వర్తిస్తున్న వైద్యులు ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిని ఆప్యాయంగా పలకరించి, మానవత్వంతో కూడిన సేవలను అందించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్య సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.
పేదవారు అనారోగ్యానికి గురైతే వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్న జిల్లా కలెక్టర్, అలాంటి వారికి ప్రభుత్వ ఆసుపత్రులే నిజమైన అండగా నిలవాలని అన్నారు. పేదలకు సేవ చేసే అదృష్టం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికే లభిస్తుందని, ఆ అవకాశాన్ని బాధ్యతగా, సేవాభావంతో వినియోగించుకోవాలని సూచించారు.
ఆసుపత్రిలో పరిశుభ్రత, మందుల లభ్యత, రోగులకు అందుతున్న సేవలపై కూడా జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకొని అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో డి సి హెచ్ ఎస్ పగడాల సూర్యనారాయణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్, వివిధ విభాగాల వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.




