Tanuku: నీట్ అంశంపై నీచ రాజకీయాలు మానాలి ముళ్లపూడి రేణుక
Tanuku: తణుకులో బీజేపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక ప్రెస్ మీట్. నీట్ అంశంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు శవ రాజకీయాలు మానాలని విమర్శ.
Tanuku: నీట్ అంశంపై నీచ రాజకీయాలు మానాలి ముళ్లపూడి రేణుక
తణుకు: నీట్ పరీక్ష అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ కాంగ్రెస్, సీజెఐ,అప్ తదితర ప్రతిపక్ష పార్టీలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక విమర్శించారు. తణుకులోని ఓ ప్రైవేటు హోటల్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
నీట్ పేపర్ లీక్ కావడం దురదృష్టకర సంఘటన అని పేర్కొన్న రేణుక, ఆ ఘటనపై కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యతతో వెంటనే పరీక్షను రద్దు చేసి సీబీఐ విచారణకు ఆదేశించిందన్నారు. ఈ కేసులో 13 మందిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అత్యంత పారదర్శకంగా, కంప్యూటరైజ్డ్ విధానంలో నీట్ పరీక్షను తిరిగి నిర్వహించిందని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువత సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రేణుక పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహం, స్టార్టప్‌ల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. దేశ యువత మెరుగైన నైపుణ్యాలతో ప్రపంచ స్థాయిలో రాణించేలా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా మార్గదర్శకత్వం అందిస్తోందన్నారు.
నీట్ అంశాన్ని అడ్డం పెట్టుకుని దేశ వ్యాప్తంగా కొందరు రాజకీయ పార్టీలు అనవసర ఆందోళనలు సృష్టించడం బాధాకరమన్నారు. దేశ వ్యతిరేక శక్తులు ఢిల్లీలో కావాలనే కృత్రిమంగా సమస్యను సృష్టించి అలజడి రేపుతున్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రధాని నివాసం వద్ద ఆందోళనలకు దిగడం వారి రాజకీయ వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించేందుకు పార్లమెంట్ అనే అత్యున్నత వేదిక ఉండగా, బీజేపీ ప్రభుత్వం చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరడం రాజకీయ ఉద్దేశంతోనే జరుగుతోందని ఆమె విమర్శించారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన నిరసనల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు భారతమాతను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన వీడియోలు బయటకు వచ్చాయని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ స్వలాభం కోసం కొందరు చేస్తున్న నీచ రాజకీయాల్లో యువత భాగస్వామ్యం కావద్దని సూచించారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములై తమ బంగారు భవిష్యత్తుపై దృష్టి సారించాలని యువతకు ముళ్లపూడి రేణుక పిలుపునిచ్చారు.




