Tanuku: అప్పులు బాధ తాళలేక గోదావరిలో దూకి కుటుంబ ఆత్మహత్య!
Tanuku: అప్పుల బాధతో తణుకుకు చెందిన కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్య ప్రాణాలతో బయటపడగా, తండ్రి, ఇద్దరు పిల్లల మృతదేహాలను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి.
Tanuku: అప్పులు బాధ తాళలేక గోదావరిలో దూకి కుటుంబ ఆత్మహత్య!
Tanuku: యలమంచిలి మండలం చించినాడ వద్ద పది రోజుల వ్యవధిలో రెండో ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళ్ల లేక తణుకు పట్టణానికి చెందిన శ్రీనివాస్ కుటుంబం శనివారం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. వీరిలో భార్యను జాలర్లు రక్షించగా, తండ్రి, కుమారుడు, కుమార్తె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఎస్ఢీఆర్ఎఫ్ బృందాలు ముగ్గురు మృతదేహాలను గుర్తించి వెలికితీశారు.
తణుకుకు చెందిన నంబూరి శ్రీనివాస్ (45), కుమారుడు ఈశ్వర్ (17), కుమార్తె నిత్యశ్రీ (16) మృత దేహాలను యలమంచిలి మండలం భాడవ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన పద్మిని ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
కృష్ణాష్టమి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని..
కృష్ణాష్టమి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న కుటుంబం మరుసటి రోజే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడం స్థానికంగా, బంధువుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన నంబూరు శ్రీనివాస్, పద్మిని దంపతులు ఇరవై ఏళ్ల క్రితం వీరవాసరం మండలం మత్స్యపురి నుంచి తణుకు వచ్చి,19వ వార్డు కొట్టు వారి వీధిలో కిరాణా, పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పాలిటెక్నిక్ చదువుతున్న కుమారుడు ఈశ్వర్ (17), తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె నిత్య (16) ఉన్నారు.
శుక్రవారం కృష్ణాష్టమి వేడుకల్లో ఈశ్వర్ ఉత్సాహంగా పాల్గొని ఉట్టి కొట్టగా.. నిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్యం చేసి అలరించింది. శనివారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో నలుగురు కుటుంబ సభ్యులు కలసి రెండు మోటారుసైకిళ్లపై తణుకు నుంచి బయలుదేరి యలమంచిలి మండలం చించినాడ వంతెనపైకి చేరుకున్నారు. కాసేపు అక్కడ తచ్చాడి నలుగురూ గోదావరిలోకి దూకేశారు. అదే సమయంలో అక్కడ నదిలో పడవలపై చేపల వేట సాగిస్తున్న జాలర్లు ఈ దృశ్యాన్ని చూసి అప్రమత్తమయ్యారు. గోదావరిలోకి దూకి కొట్టుకుపోతున్న పద్మినిని రక్షించి ఒడ్డుకు చేర్చారు.
శ్రీనివాస్, ఈశ్వర్, నిత్య గల్లంతయ్యారు. పోలీసులు వచ్చి పద్మినిని పాలకొల్లు, తణుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పాలకొల్లు రూరల్ సీఐ జి.శ్రీనివాస్, ఎస్‌ఐ రాజ్‌కుమార్ నేతృత్వంలో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్, పోలీసు సిబ్బంది గోదావరిలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
* ఆర్థిక ఇబ్బందులే కారణం*
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య యత్నానికి పాల్పడిన పద్మిని.. తన తల్లికి రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘అమ్మా.. నన్ను క్షమించు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం. మా గురించి వెతకవద్దు. మేము తనఖా పెట్టిన నీ ఆస్తి పత్రాలు ఫలానా వ్యక్తి వద్ద ఉన్నాయి. ఇంకా రూ.2,60,000 చెల్లించాలి.
ఈ సొమ్ము చెల్లిస్తే నీ ఇంటి కాగితాలు నీకిస్తారు. విడిపించుకో’ అంటూ పద్మిని రాసిన సూసైడ్ నోట్ బయటపడింది. శ్రీనివాస్ కుటుంబం ఆత్మహత్యకు ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ వద్ద తీసుకున్న అప్పు కూడా ఒక కారణంగా తెలుస్తోంది. పద్మిని తల్లి పేరిట ఉన్న ఇంటిపై తణుకులోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో అప్పు తీసుకున్నారు.
దీని నిమిత్తం ప్రతి నెలా రూ.14,100 చెల్లిస్తున్నారు. రెండు నెలలుగా ఈఎంఐలు చెల్లించకపోవడంతో చెక్కులు బౌన్స్ అయ్యాయి. మరోవైపు శ్రీనివాస్ కుటుంబాన్ని వేరే వ్యక్తి ఆర్థికంగా మోసం చేయడం, చెల్లించవలసిన రుణభారం పెరిగిపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిసింది.




