Rampachodavaram: కలెక్టరేట్‌ను ముట్టడించిన స్కీమ్ వర్కర్లు రంపచోడవరంలో ఆందోళన
Rampachodavaram: రంపచోడవరంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కలెక్టరేట్‌ను ముట్టడించిన స్కీమ్ వర్కర్లు. రూ.26,000 కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించాలని సీఐటీయూ డిమాండ్.
Rampachodavaram: కలెక్టరేట్‌ను ముట్టడించిన స్కీమ్ వర్కర్లు రంపచోడవరంలో ఆందోళన
రంపచోడవరం: స్కీం వర్కర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోలవరం జిల్లా రంపచోడవరంలో కార్మికులు కదం తొక్కారు. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, వీవోఏ (VOA) వర్కర్లు వందలాదిగా తరలివచ్చి కలెక్టరేట్‌ను ముట్టడించారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి ఆందోళన చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రంపచోడవరంలో స్కీం వర్కర్లు రోడ్డెక్కారు. సీఐటీయూ పోలవరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల కార్యాలయం నుండి అంబేద్కర్ జంక్షన్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట పెద్ద సంఖ్యలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. కుండపోత వర్షం పడుతున్నా వెనక్కి తగ్గకుండా... తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాడుతామంటూ గంటలకొద్దీ ఆందోళన కొనసాగించారు.
స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రత కల్పించాలి. మధ్యాహ్న భోజన పథకంలో 'స్మార్ట్ కిచెన్' ప్రతిపాదన విరమించుకోవాలి. అంగన్వాడీలకు 'నవచైతన్య యాప్'ను రద్దు చేయాలి. స్కీం వర్కర్లందరికీ ప్రభుత్వ పెన్షన్ పథకాలు సమానంగా వర్తింపజేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
ఆశా కార్యకర్తల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఏఎన్ఎం (ANM), జిఎన్ఎమ్ (GNM) పోస్టుల భర్తీలో ఆశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇక విద్యార్థులకు మధ్యాహ్న భోజన మెనూ ఛార్జీలను 20 రూపాయలకు పెంచాలని, అంగన్వాడీలలో 164 సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాణిశ్రీ, నిర్మల, రాజేశ్వరి, వీరమ్మతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పాల్గొన్నారు




