Velerupadu: శిరీషకు న్యాయం చేయాలి.. ఆదివాసీ మహిళలకు రక్షణ కల్పించాలి
Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం పాత పూచిరాలలో అత్యాచారానికి గురై మృతి చెందిన ఆదివాసీ యువతి శిరీషకు గ్రామస్తులు కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పించారు.
Velerupadu: శిరీషకు న్యాయం చేయాలి.. ఆదివాసీ మహిళలకు రక్షణ కల్పించాలి
వేలేరుపాడు: అత్యాచారానికి గురై మృతి చెందిన ఆదివాసీ యువతి వూకే శిరీషకు న్యాయం చేయాలని, మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం పాత పూచిరాల గ్రామంలో గ్రామస్తులు కొవ్వొత్తులు వెలిగించి శిరీషకు నివాళులర్పిం చారు. శిరీషపై జరిగిన ఘటన అత్యంత విషాదకరమైనదని, ఆమె మృతి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ముఖ్యంగా ఆదివాసీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హింసకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరారు.
శిరీష మృతి ఘటనపై నిష్పక్షపాతంగా, సమగ్రంగా దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నేరానికి పాల్పడిన వారిని గుర్తించి, వారు ఎవరైనా సరే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దర్యాప్తులో ఎలాంటి రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు తావులేకుండా అధికారులు వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే శిరీష కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం, భద్రత, న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో ఆదివాసీ మహిళలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
శిరీషకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తాం. ప్రతి ఆదివాసీ గూడెంలో ఈ ఘటనపై నిరసన కార్యక్రమాలు నిర్వహించి, తమ ఆవేదనను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం అని గ్రామస్తులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాత పూచిరాల గ్రామస్తులందరూ పాల్గొని శిరీషకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.




