Devarapalli: కూటమి ప్రభుత్వంపై జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు!
Devarapalli: మాజీ సీఎం వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటన వేళ కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే వెంకటరాజుపై వైఎస్సార్‌సీపీ నేత జక్కంపూడి రాజా తీవ్ర విమర్శలు చేశారు.
Devarapalli: కూటమి ప్రభుత్వంపై జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు!
దేవరపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేవరపల్లి పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కూటమి నాయకులపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం దేవరపల్లిలో జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పొగాకు రైతుల సమస్యలను తెలుసుకుని వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో జగన్ వస్తున్నారని, అయితే రైతుల సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలకు పాల్పడటం సరికాదని జక్కంపూడి రాజా అన్నారు. ఎమ్మెల్యే వెంకటరాజు పనికిమాలిన వ్యాఖ్యలు మానేసి రైతులకు ఎలా మేలు చేయాలనే అంశంపై దృష్టి సారించాలని సూచించారు.
పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభమై 110 రోజులు గడిచినా కేవలం 15 శాతం మాత్రమే కొనుగోళ్లు జరిగాయని, మిగిలిన 85 శాతం ఎప్పటిలోపు కొనుగోలు చేస్తారో ప్రభుత్వం రైతులకు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ పొగాకు రైతులకు న్యాయమైన ధర కల్పించడంలో విఫలమయ్యాయని విమర్శించారు.
కిలో పొగాకుతో వేలాది సిగరెట్లు తయారు చేసి భారీ లాభాలు పొందుతున్నప్పటికీ రైతుకు మాత్రం కిలోకు రూ.160 నుంచి రూ.250 మధ్య మాత్రమే ధర లభిస్తోందని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో గత రెండేళ్లుగా పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని, గంజాయి మినహా ఏ పంటకూ సరైన ధర దక్కడం లేదని జక్కంపూడి రాజా ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని, రాజకీయ విమర్శల కంటే రైతుల సంక్షేమమే ప్రాధాన్యంగా చూడాలని ఆయన సూచించారు.
జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదరణ ఉందని, ప్రజలు స్వచ్ఛందంగా సభలకు తరలివస్తున్నారని రాజా పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ సభలకు ప్రజలను తీసుకురావడానికి ఎలాంటి ప్రలోభాలు అవసరం లేదని, ప్రజలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలే పార్టీకి ఆదరణ తీసుకొచ్చాయని ఆయన అన్నారు.




