Katrenikona: మొండిపోరలో అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలపై రైతుల తిరుగుబాటు

Katrenikona: కాట్రేనికోన మండలం మొండిపోర గ్రామంలో అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలను స్థానిక రైతులు అడ్డుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 27 Jun 2026 12:32 PM IST
Katrenikona
X

Katrenikona: మొండిపోరలో ఉద్రిక్తత..

కాట్రేనికోన: కాట్రేనికోన మండలం మొండిపోర గ్రామంలో జరుగుతున్న అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలను సరిహద్దు రైతులు, స్థానికులు అడ్డుకున్నారు. వ్యవసాయ భూములను రొయ్యల చెరువులుగా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు.

రొయ్యల చెరువుల తవ్వకాల వల్ల తమ సారవంతమైన పంట పొలాలు శాశ్వతంగా దెబ్బతింటాయని సరిహద్దు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పునీటి ప్రభావంతో భూముల సారం కోల్పోయి వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని వారు హెచ్చరించారు.

స్థానికులు మాట్లాడుతూ, రొయ్యల సాగు కారణంగా భూగర్భ జలాలు కలుషితమై తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం రెండూ ప్రమాదంలో పడతాయని చెబుతూ వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

గ్రామస్తులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ చెరువుల తవ్వకాలు కొనసాగుతుండటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత బహిరంగంగా అక్రమాలు జరుగుతున్నా రెవెన్యూ, మత్స్యశాఖ, ఇతర సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు.

"ప్రజల వ్యతిరేకత ఉన్నా యంత్రాలు ఆగకపోవడం వెనుక బడాబాబుల అండదండలు, రాజకీయ నాయకుల ప్రమేయం లేకపోతే ఎలా సాధ్యం?" అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొందరు ప్రభావశీలుల ఒత్తిళ్ల కారణంగానే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు.

వ్యవసాయ భూములను రక్షించాల్సిన బాధ్యత అధికారులదేనని, అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలను వెంటనే నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సరిహద్దు రైతులు, స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు....

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story