Bhimavaram: అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన పశ్చిమ గోదావరి దివ్యాంగ క్రీడాకారులు!
Bhimavaram: థాయ్‌లాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్స్-2026లో పతకాలు సాధించిన జిల్లా దివ్యాంగ క్రీడాకారులను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందించారు.
Bhimavaram: అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన పశ్చిమ గోదావరి దివ్యాంగ క్రీడాకారులు!
భీమవరం: థాయ్‌లాండ్‌లోని శ్రీరాచాలో ఏప్రిల్ 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్స్–2026లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దివ్యాంగ క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్ లో సోమవారం క్రీడాకారులు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను అభినందించారు. ఈ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని జిల్లా నుంచి మరి కొంతమంది క్రీడాకారులు తయారవ్వాలని ఆమె ఆకాంక్షించారు. పారా అథ్లెటిక్స్‌లో పశ్చిమ గోదావరి జిల్లాకు అత్తిలి గ్రామం చెందిన యడ్లపల్లి సూర్యనారాయణ, షాట్‌పుట్ ఎఫ్–42 కేటగిరీలో బంగారు పతకం, జావెలిన్ త్రో ఎఫ్–42 కేటగిరీలో కాంస్య పతకం సాధించారు. అలాగే పాలకొల్లు కు చెందిన మురపాక నళినిరాజశేఖర్.
పారా పికిల్‌బాల్ పీపీ–54 కేటగిరీలో కాంస్య పతకం, జావెలిన్ త్రో ఎఫ్–54 కేటగిరీలో వెండి పతకం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారని ఆమె అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఈ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి, వారికి అర్హత మేరకు క్రీడా ప్రోత్సాహకాలు మంజూరు చేయించేందుకు అవసరమైన సిఫారసు చేసి, సంబంధిత అధికారులతో సమన్వయం చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా మరింత మంది క్రీడా రంగంలోకి వచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు స్ఫూర్తి లభిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భం లో జిల్లా జాయింట్ కలెక్టర్ కె ఆర్ కల్పశ్రీ, డిఆర్ఓ పి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.




