Bhimavaram: జేసీ రంగంలోకి దిగే వరకు కదలని సిఐటియు శ్రేణులు!
Bhimavaram: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రూ.26 వేల కనీస వేతనం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్ ను ముట్టడించగా, జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.
Bhimavaram: జేసీ రంగంలోకి దిగే వరకు కదలని సిఐటియు శ్రేణులు!
భీమవరం జూలై 30 : షెడ్యూల్డ్ పరిశ్రమల కార్మికుల సమస్యలపై సిఐటియు రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం కార్మిక వర్గం కలెక్టరేట్ వద్ద కదం తొక్కారు. కనీస వేతనం 26000 ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటి సదుపాయం కల్పించాలని, రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, నెల నెల వేతనాలు చెల్లించాలని, అదనపు డ్యూటీలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై కూర్చున్న కార్మికులను అడ్డు తొలగాలని పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ కార్మికులు మాకే నిబంధనలు వర్తిస్తాయి అంటూ ప్రశ్నించారు.
మేము ఎక్కడ పని చేస్తున్నామో, ఎంత వేతనం ఇస్తున్నారో, ఎలా బ్రతుకుతున్నామో కనీసం చెప్పుకోవడానికి కూడా అర్హత లేదా అంటూ కార్మిక వర్గం కన్నెర్ర చేసింది. తాము చేసే శ్రమ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, తాము ఓట్లేస్తేనే ప్రభుత్వం గెలిచిందని హెచ్చరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిఐటియు జిల్లా కోశాధికారి పివి ప్రతాప్ అధ్యక్షత వహించారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ కనీస వేతనాలను సవరించి 20 ఏళ్లు అయిందని, షెడ్యూల్ పరిశ్రమలలో లక్షల మంది కనీస సౌకర్యాలు, వేతనాలు లేకుండా సంవత్సరాల తరబడి పని చేస్తున్నారని అన్నారు. ఓట్లు లెక్కల్లో తప్ప మరే లెక్కల్లోనూ ఈ కార్మికులను ప్రభుత్వం గుర్తించడం లేదని అన్నారు.
పెరిగిన ధరలు, ఖర్చులు, అనారోగ్యాలు కార్మికులను ఆలోచింపజేస్తున్నాయని, వివిధ రాష్ట్రాల్లో కార్మిక వర్గం చేసిన పోరాటాల ఫలితంగానే వేతనాలు పెరిగాయని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి వాసుదేవరావు మాట్లాడుతూ కార్మికులను పారిశ్రామికవేత్తలుగా చేస్తామని మాటలు చెప్పడం తప్ప చట్ట ప్రకారం వారికి ఇవ్వాల్సిన వేతనాలు, సౌకర్యాలు పాలకులు ఇవ్వడం లేదని అన్నారు. సమస్యలు చెప్పుకుందామని వస్తే నిలబడ్డానికి కూడా చోటు లేదని ఆంక్షలు విధిస్తున్నారని ఇది సిగ్గుచేటని అన్నారు.
షెడ్యూల్ పరిశ్రమల కార్మికులు వారి రెక్కల కష్టం తో అనేక రకాల పనులు, వృత్తులు చేస్తున్నారని, కనీసం వారు ఎంతమంది ఉన్నారో కూడా ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవని అన్నారు. పొట్ట చేత పట్టుకుని సుదూర ప్రాంతాల నుంచి వలస కార్మికులు ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారని ఇక్కడ నుంచి వేరే చోటికి వెళ్లి పనులు చేస్తున్నారని అన్నారు. వారు చేస్తున్న శ్రమ వల్ల లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అన్నారు. గత నెల రోజులుగా జిల్లాలో ఆయా రంగాలలో పనిచేస్తున్న కార్మికులను స్వయంగా కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నామని అన్నారు. కనీస వేతనాలు, సౌకర్యాలు, ఉండడానికి ఇల్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
వలస కార్మికులైతే పిచ్చిగుళ్లాంటి షెడ్యూల్లో జీవిస్తున్నారని అన్నారు. సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జేఎన్వి గోపాలం మాట్లాడుతూ కార్మిక వర్గం చేస్తున్న పోరాటానికి సిపిఎం అండదండలనిస్తుందని అన్నారు. కోట్ల రూపాయల విలువచేసే భూములను రైతుల వద్ద నుంచి బలవంతంగా లాక్కుని బడా బాబులకు 99 పైసలకే ఇస్తానంటున్న ప్రభుత్వం షెడ్యూలు పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులను గుర్తించకపోవడం కనీస వేతనాలు సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం దారుణమని అన్నారు.
రైస్ మిల్లు, గ్యాస్, పంచాయితీ, వీఆర్ఏ, ఫ్యాక్టరీ, మునిసిపల్, ఆక్వా, ప్రైవేట్ విద్య, భవన నిర్మాణం, స్కూల్స్ పేపర్స్, బజార్ జట్టు, వెహికల్ డ్రైవర్స్, సెక్యూరిటీ గార్డులు పెట్రోల్ బంక్ కార్మికులు, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులు, రూరల్ వాటర్ సప్లై కార్మికులు, సెకండ్ ఏఎన్ఎం లు, షాపు ఎంప్లాయిస్, వలస కార్మికులు వంటి వేల మంది కార్మికులు జిల్లాలో పనిచేస్తున్నారని అన్నారు.
వీరందరి సమస్యలపై సిఐటియు చేస్తున్న పోరాటం అభినందనీయమని అన్నారు. వీరి సమస్యలు పరిష్కారమయ్యే వరకు సిపిఎం అండగా ఉంటుందని అన్నారు. అనంతరం బరికేడ్లను తోసుకొని కలెక్టరేట్లోకి దూసుకు వెళ్లారు. కలెక్టరేట్ గేటు ముందు కూర్చుని కలెక్టర్ వచ్చి మా సమస్యలు వినాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు బృందం కలెక్టరు జాయింట్ కలెక్టర్ తో మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ బయటికి వచ్చి వినతి పత్రాలు తీసుకుని, కార్మికులతో మాట్లాడి, వారు చెప్పే సమస్యలు విని, జాయింట్ మీటింగ్ వేసి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం ఆంజనేయులు, ఎస్ రంగారావు, డి కళ్యాణి, ఎస్ వెంకటేశ్వరరావు, గొర్ల రామకృష్ణ, యం త్రిమూర్తులు, కే రామకృష్ణ, పట్టణ పేదల సంక్షేమ సంఘం నాయకులు ఎం వైకుంఠరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ, బాతిరెడ్డి జార్జి, కెవిపిఎస్ జిల్లా నాయకులు కే క్రాంతి బాబు, వరలక్ష్మి, లారెన్స్ కుమారి, ఇంజెటి శ్రీనివాస్, చల్లబోయిన వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు తదితరులు నాయకత్వం వహించారు. ఎం ఆంజనేయులు సిఐటియు జిల్లా నాయకులు.




