Bhimavaram: భీమవరంలో ధర్నా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
Bhimavaram: భీమవరం హెడ్ పోస్టాఫీస్ వద్ద విద్యార్థి, ప్రజా సంఘాల నిరసన. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. పోలీసులతో వాగ్వివాదం.
Bhimavaram: భీమవరంలో ధర్నా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
భీమవరం: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలని విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ గురువారం స్థానిక హెడ్ పోస్టాఫీస్ వద్ద విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసనలు తెలిపారు. తొలుత యూటీఎఫ్ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ మీదుగా హెడ్ పోస్టాఫీసు వద్దకు ర్యాలీ నిర్వహించారు. శాంతియుతంగా నిర్వహించే కార్యక్రమంలో విద్యార్థి, ప్రజా సంఘాల నేతలపై వాగ్వివాదం చేశారు. అనంతరం హెడ్పోస్టాఫీసు వద్ద నిరసనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్ మాట్లాడుతూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువకులపై లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని ఖండించారు. దేశంలో బీజేపీ హయంలో ఇప్పటివరకు 152 అత్యున్నత పరీక్ష పత్రాలు లీకేజీ అయ్యాయని తెలిపారు. ఇలాంటి అసమర్థ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ అసమర్థత వలన దేశంలో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమైందన్నారు. తక్షణం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు మాట్లాడుతూ విద్యార్థుల భవితవ్యాన్ని అవినీతితో భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం చేతకానితనంతో 22మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కార్మికులు, కర్షకులు, చిరు ఉద్యోగులు అప్పులుచేసి మరీ లక్షల్లో ఫీజులు కట్టి చదివిస్తుంటుంటే బీజేపీ ప్రభుత్వం పేపర్ లీకేజీలు చేసి వారి జీవితాలను నాశనం చేస్తుందని మండిపడ్డారు.
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే లాఠీచార్జి చేయడం చేతకాని తనమని లాఠీలతో, తూటాలతో ఉద్యమాలను అణచివేయడం బ్రిటిష్ వాళ్ళకే చేతకాలేదని గుర్తుచేశారు. దేశానికి యువతే వెన్నెముకగా చెప్పే మోడీ నేడు అదే దేశ యువతపై కర్కశంగా వ్యవహరించడం తగదన్నారు.
దేశంలో ప్రశ్నిస్తే అణచివేయాలని చూస్తే మరో ప్రశ్న కూడా మొదలవుతుంది తప్ప ప్రశ్ని ఎప్పటికీ అంతరించదన్నారు. ఢిల్లీలో విద్యార్థులు, యువకులు శాంతియుతంగా చేసే ఉద్యమానికి నేడు దేశ రైతాంగం, కార్మికులు కూడా మద్దతు పలుకుతున్నారని ప్రజలందరూ అనేకరూపాల్లో సహకారం అందిస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు చేసే ఉద్యమంలో జిల్లాలో కూడా అన్ని విద్యార్థి, యువజన,దళిత, ప్రజా సంఘాలు సంయుక్తంగా ఐక్యంగా ఉద్యమంలో భాగస్వామ్యం అవుతామని ఆయన చెప్పారు.
అనంతరం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాతిరెడ్డి జార్జి సంఘీభావం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె .రాజారామ్మోహన్ రాయ్, జిల్లా కార్యదర్శి మల్లిపూడి ఆంజనేయులు, పట్టణపౌర సమాఖ్య జిల్లా కన్వీనర్ ఎం.వైకుంఠరావు, పట్టణనాయకులు త్రిమూర్తులు, ఎస్.ఎఫ్.ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పి.సాయికృష్ణ, ఎస్.లక్ష్మణ్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ సింధు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.సాయి ఫణికుమార్, నాయకులు వంశీ, సతీష్, రేష్మ, కౌశిక్, త్రినాథ్ మరియు తదితరులు పాల్గొన్నారు.




