Bhimavaram: భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పిలుపు!
Bhimavaram: భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' యాత్ర వైభవంగా సాగింది.
Bhimavaram: భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పిలుపు!
భీమవరం: నేషన్ ఫస్ట్ స్ఫూర్తితో దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకుంటూ వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. భారతదేశాన్ని ‘విశ్వగురు’గా తీర్చిదిద్దే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా భీమవరంలో సోమవారం భారీ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్రను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో పాటు కూటమి శ్రేణులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో జాతీయ జెండాలను చేతబూని ఉత్సాహంగా తిరంగా యాత్రలో పాల్గొన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన యాత్ర ఓవర్‌బ్రిడ్జి, ప్రకాశం చౌక్ మీదుగా కొనసాగింది. మార్గమధ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అడ్డ వంతెన మీదుగా ASR నగర్‌లోని మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు యాత్ర కొనసాగింది.




