Bhimavaram: భీమవరంలో విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ నిరసన!

Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 20 Aug 2026 9:06 PM IST
Bhimavaram
X

Bhimavaram: భీమవరంలో విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ నిరసన!

​భీమవరం: రాష్ట్రంలో నెలకొన్న విద్యా రంగా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రభుత్వం రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ (AISF) పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి సీహెచ్ సుందర్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ భీమవరంలోని ప్రకాశం చౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్ సుందర్, సహాయ కార్యదర్శి హేమంత్‌లు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకూ విద్యారంగ సమస్యలు తీవ్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

​ప్రధాన డిమాండ్లు & విమర్శలు:

​మెస్ ఛార్జీలు పెంపు: సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 48 మెస్ ఛార్జీలతో నాణ్యమైన ఆహారం అందడం లేదని, దాన్ని వెంటనే రూ. 100కు పెంచాలని కోరారు.

​ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు: డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ. 10,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, దీనివల్ల సర్టిఫికెట్లు రాక కాలేజీల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు.

​జీవో నెంబర్ 77 రద్దు: యువగళం పాదయాత్రలో అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని హామీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆ మాటను విస్మరించి విద్యార్థులను మోసం చేశారని విమర్శించారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిలిచిపోవడం వల్ల కళాశాలలు మూతపడి ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలిపారు.

​ఖాళీల భర్తీ & కొత్త కళాశాలలు: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,000కు పైగా టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను ఏర్పాటు చేయాలని కోరారు.

​వంతెన నిర్మాణం: నిర్మాణంలో ఉన్న చించినాడ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేసి విద్యార్థుల రాకపోకల కష్టాలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ​ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్, గర్ల్స్ కన్వీనర్ బేబీ, నాయకులు సాయి, కౌశిక్, అఖిల్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

Next Story