Warangal: భూటాన్ సదస్సులో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ప్రసంగం!
Warangal: వాతావరణ మార్పులపై దక్షిణాసియా దేశాలు సరిహద్దులు దాటి పోరాడాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పిలుపునిచ్చారు.
Warangal: భూటాన్ సదస్సులో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ప్రసంగం!
వరంగల్: వాతావరణ మార్పులు ప్రపంచానికి పెను సవాలుగా మారుతున్న నేపథ్యంలో.. దక్షిణాసియా దేశాలు సరిహద్దులను దాటి సమష్టి కార్యాచరణతో ముందుకు సాగాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం ఒక్క దేశం బాధ్యత కాదని.. భవిష్యత్ తరాల కోసం ప్రాంతీయ సహకారంతో సమగ్ర పరిష్కారాలను సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
భూటాన్‌లో జరుగుతున్న సౌత్ ఏషియా పార్లమెంటరీ డైలాగ్ ఆన్ ఎన్విరాన్‌మెంట్, క్లైమేట్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. దక్షిణాసియా దేశాలకు చెందిన పార్లమెంటేరియన్లు, విధాన నిర్ణేతలు, నిపుణులు ఒకే వేదికపైకి వచ్చి పర్యావరణం, వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధిపై ఈ సదస్సులో చర్చించడం జరిగింది.
ఈ సదస్సులో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే ప్రజల జీవన విధానంపై స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, అనియంత్రిత వర్షాలు, వరదలు, కరువులు, నీటి కొరత వంటి పరిణామాలు వ్యవసాయం, జీవనోపాధి, ప్రజారోగ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.
“వాతావరణ మార్పులకు సరిహద్దులు లేవు. కాబట్టి పరిష్కారాలకు కూడా సరిహద్దులు ఉండకూడదు. దక్షిణాసియా దేశాలు పరస్పర సహకారంతో పనిచేసినప్పుడే వాతావరణ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోగలం” అని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అన్నారు.
పునరుత్పాదక ఇంధనం, స్వచ్ఛమైన ఇంధన వనరులు, నీటి సంరక్షణ, హరిత మౌలిక వసతులు, జీవవైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యం
వాతావరణ మార్పుల ప్రభావాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్న రైతులు, మహిళలు, యువత, పేదలు, అట్టడుగు వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విధానాలు రూపొందించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులు, నీటి నిర్వహణ, విపత్తుల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
భారత్ అనుభవాలను పంచుకుంటాం
వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు భారత్ చేపడుతున్న పునరుత్పాదక ఇంధనం, హరిత అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ఇతర దక్షిణాసియా దేశాలకు ఉపయోగపడేలా అనుభవాలను పంచుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ డా. కడియం కావ్య అన్నారు. దక్షిణాసియా దేశాల పార్లమెంటేరియన్ల మధ్య ఇటువంటి సంభాషణలు మరింత పెరగాలని, ఉమ్మడి సమస్యలపై ఉమ్మడి విధానాలు–ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవాలని ఆకాంక్షించారు.
ఆర్థికాభివృద్ధితో పాటు ప్రకృతి వనరులను కాపాడటం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న ఎంపీ డా. కడియం కావ్య.. “ఈరోజు తీసుకునే నిర్ణయాలే రేపటి తరాల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అభివృద్ధి అంటే ప్రకృతిని నాశనం చేయడం కాదు.. ప్రకృతిని కాపాడుతూ అభివృద్ధి సాధించడమే నిజమైన సుస్థిర అభివృద్ధి” అని అన్నారు.
భూటాన్ వేదికగా జరుగుతున్న ఈ పార్లమెంటరీ డైలాగ్ దక్షిణాసియా దేశాల మధ్య పర్యావరణ, వాతావరణ విధానాలపై సమన్వయానికి కీలక వేదికగా నిలుస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు.




