Warangal: మానసిక దివ్యాంగ చిన్నారులతో కడియం కావ్య, శ్రీహరి రాఖీ వేడుకలు

Warangal: డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి హన్మకొండలోని తమ నివాసంలో మల్లికాంబ మనోవికాస కేంద్రం దివ్యాంగ చిన్నారులతో కలిసి రాఖీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 28 Aug 2026 7:38 PM IST
Warangal
X

Warangal: మానసిక దివ్యాంగ చిన్నారులతో కడియం కావ్య, శ్రీహరి రాఖీ వేడుకలు

వరంగల్: సోదర సోదరీమణుల అనురాగానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వేడుకలను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు హన్మకొండ కనకదుర్గ కాలనీలోని తమ నివాసంలో మల్లికాంబ మనోవికాస కేంద్రం మానసిక దివ్యాంగ చిన్నారుల సమక్షంలో అత్యంత వైభవంగా, ఆత్మీయ వాతావరణంలో జరుపుకున్నారు.

​ఈ సందర్భంగా మల్లికాంబ మనోవికాస కేంద్రం నుండి వచ్చిన మానసిక దివ్యాంగ చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారికి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి రాఖీలు కట్టారు. పిల్లలు చూపించిన స్వచ్ఛమైన ఆప్యాయతకు ఎంపీ, ఎమ్మెల్యే లు ఇద్దరూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. రాఖీలు కట్టిన చిన్నారులకు ఎంపీ, ఎమ్మెల్యేలు స్వయంగా మిఠాయిలు తినిపించి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులతో కాసేపు సరదాగా మాట్లాడి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

​ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ.... పండుగలు, వేడుకలు అంటే కేవలం మన కుటుంబ సభ్యులతోనే కాకుండా, సమాజంలో ప్రత్యేక ఆదరణ, ప్రేమాభిమానాలు అవసరమైన దివ్యాంగ పిల్లలతో కలిసి జరుపుకోవడంలోనే నిజమైన సంతృప్తి, ఆనందం ఉంటుందని తెలిపారు. మానసిక దివ్యాంగ పిల్లలకు సమాజంలో సరైన ప్రోత్సాహం, అనురాగం అందిస్తే వారు కూడా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని అన్నారు. ​

దివ్యాంగ చిన్నారులను ఆప్యాయంగా చూసుకుంటూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్న మల్లికాంబ మనోవికాస కేంద్రం నిర్వాహకులను, ఉపాధ్యాయులను అభినందించారు. దివ్యాంగ పిల్లల సంక్షేమానికి, మల్లికాంబ మనోవికాస కేంద్రం అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ​ఈ వేడుకల్లో మల్లికాంబ మనోవికాస కేంద్రం నిర్వాహకులు, ప్రతినిధులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story