Warangal: వసంతపూర్‌లో భూ రీసర్వే గ్రామసభ - పాల్గొన్న కలెక్టర్ సత్య శారద
Warangal: వరంగల్ జిల్లాలో భూ రీసర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ సత్య శారద. రైతులకు అవగాహన కల్పించి, పారదర్శకంగా సర్వే చేయాలని అధికారులకు ఆదేశం.
Warangal: వసంతపూర్‌లో భూ రీసర్వే గ్రామసభ - పాల్గొన్న కలెక్టర్ సత్య శారద
వరంగల్: వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలోని వసంతపూర్ గ్రామంలో మంగళవారం భూ రీసర్వే ప్రక్రియపై గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని రైతులకు రీసర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూముల రీసర్వే ద్వారా భూ హక్కులు, సరిహద్దులు, విస్తీర్ణం తదితర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పక్కాగా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. రీసర్వే ప్రక్రియలో రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవాలని, ఏవైనా అభ్యంతరాలు లేదా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
రీసర్వే సమయంలో రైతులు అధికారులకు సహకరించాలని, భూ వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లు లేకుండా క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు రీసర్వేకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించి, వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.
అనంతరం వరంగల్ మండలంలోని కొత్తపేట గ్రామంలో నిర్వహిస్తున్న ఫీల్డ్ రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో కలిసి రీసర్వే ప్రక్రియను పరిశీలించి, భూముల సరిహద్దులు, సర్వే వివరాల నమోదు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రైతుల సమక్షంలోనే క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, భూ వివరాల నమోదులో ఖచ్చితత్వం పాటించాలని అధికారులకు సూచించారు. రీసర్వే ద్వారా భవిష్యత్‌లో భూ వివాదాలకు అవకాశం లేకుండా స్పష్టమైన భూ రికార్డులు రూపొందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె కిషోర్ కుమార్, ఆర్డీవో సుమ, ఏడి సర్వే మరియు రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు, వరంగల్, ఖిలా వరంగల్ తహసీల్దార్లు శ్రీకాంత్ ,ఇక్బాల్,తో పాటు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




