Warangal: వరంగల్‌లో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

Warangal: వరంగల్ విద్యానగర్ ఎస్సీ కాలనీ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద. సుకన్య సమృద్ధి యోజనపై అవగాహన.

Narender, Staff Reporter  -Warangal
Published on: 7 Aug 2026 8:49 PM IST
Warangal
X

Warangal: వరంగల్‌లో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

వరంగల్: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని వరంగల్ ప్రాజెక్టు లక్ష్మీనగర్ సెక్టార్ పరిధిలోని విద్యానగర్ ఎస్సీ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం అవగాహన కార్యక్రమంతో పాటు చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు.

బాలికల భవిష్యత్ విద్య, ఉన్నత చదువులు, వివాహ అవసరాలకు సుకన్య సమృద్ధి యోజన పథకం ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ప్రతి కుటుంబం తమ కుమార్తెల పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ప్రారంభించి, క్రమం తప్పకుండా పొదుపు చేయాలని సూచించారు. బాలికల భవిష్యత్ భద్రతకు ఈ పథకం మంచి పెట్టుబడిగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

శిశువుకు పుట్టిన వెంటనే మొదటి ఆరు నెలల పాటు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని, ఆరు నెలలు పూర్తయిన తర్వాత తల్లిపాలతో పాటు పరిపూరక ఆహారాన్ని ప్రారంభించాలని తల్లులకు సూచించారు. రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలు అందించడం ద్వారా శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడాలని ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి బి. రాజమణి మాట్లాడుతూ, 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలను తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ-స్కూల్ విద్యతో పాటు ఆటల ద్వారా నేర్చుకునే విధానం, పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం చిన్నారులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. చిన్ననాటి నుంచే ఆటల ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సామాజిక నైపుణ్యాలు పెంపొందుతాయని అధికారులు వివరించారు.

ఆటలు పిల్లల శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ శ్రీమతి విద్య, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు, తల్లిదండ్రులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story