Hanumakonda: ఓటరు జాబితా సవరణపై సీఈవో సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్!

Hanumakonda: తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ, గ్రామ మరియు వార్డు సభల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 24 Aug 2026 9:26 PM IST
Hanumakonda
X

Hanumakonda: ఓటరు జాబితా సవరణపై సీఈవో సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్!

హనుమకొండ: ఆగస్టు 27న రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ సభలు/వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చాహత్ బాజ్ పాయి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఆగస్టు 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ సభలు/వార్డు సభలు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ భవనంలో, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత పోలింగ్ కేంద్రంలో సభలు నిర్వహించాలని తెలిపారు.

సంబంధిత బీఎల్‌ఓలు, చునావ్ పాఠశాల సభ్యులు సభల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ సభలు/వార్డు సభల నిర్వహణపై బీఎల్‌ఓల ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. సభల వద్ద ఫారం-6, ఫారం-7, ఫారం-8 తదితర అవసరమైన ఫారాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు.గ్రామ సభ/వార్డు సభలో బీఎల్‌ఓలు డ్రాఫ్ట్ ఓటరు జాబితాలోని ఓటర్ల పేర్లను చదివి వినిపించాలని, జాబితాలో పేరు లేని అర్హత కలిగిన భారతీయ పౌరులను గుర్తించాలని సూచించారు.

01.10.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే వారు ఫారం-6తో పాటు డిక్లరేషన్ ఫారం, అవసరమైన ఆధారాలను సమర్పించి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు లేదా ఇతర వివరాల్లో తప్పులు, వ్యత్యాసాలు ఉన్నట్లయితే ఫారం-8 ద్వారా సవరణలకు దరఖాస్తు చేసుకునేలా ప్రజలకు వివరించాలని అన్నారు. అర్హత లేకపోయినా జాబితాలో పేరు నమోదైన వారిని గుర్తించి, అదే నియోజకవర్గానికి చెందిన ఓటరు ఫారం-7 ద్వారా అభ్యంతరం సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మ్యాపింగ్ కాని, అనామలీస్ గుర్తించిన ఓటర్లందరికీ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. ప్రతి నోటీసులో విచారణ తేదీ, విచారణ జరిగే ప్రదేశం, సమయాన్ని స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు. నోటీసు జారీ చేసిన తేదీకి, విచారణ తేదీకి మధ్య కనీసం 7 రోజుల వ్యవధి ఉండేలా చూడాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ... హనుమకొండ జిల్లాలో ఒక లక్ష ముప్పై రెండు వేల మంది ఎస్ఐఆర్ లో మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్నవారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలియజేశారు.

నోటీసులు జారీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాను ఈ నెల 27వ తేదీన నిర్వహించే గ్రామసభలలో అధికారులు చదివేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో రివ్యూ చేస్తూ, నోటీసుల జారీ, పంపిణీ, యాప్‌లో వివరాల అప్‌లోడ్ ప్రక్రియపై సమీక్షించారు. ప్రతి ఏఈఆర్‌ఓ నుంచి వేగవంతమైన చర్యల కోసం కార్యాచరణ ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు.

పెండింగ్‌లో ఉన్న నోటీసుల జనరేషన్, పంపిణీ, అప్‌లోడ్ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు. నోటీసులు అందజేసిన ప్రతి సందర్భాన్ని బీఎల్‌ఓ యాప్‌లో ఫొటోతో సహా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నోటీసు అందజేయడం, దానికి సంబంధించిన ఫొటో, వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయడం ఏకకాలంలోనే జరగాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

నోటీసుల వివరాల నమోదు, అప్‌లోడ్ విషయంలో సంబంధిత ఎంఆర్‌ఓలు స్వయంగా పరిశీలించి ధ్రువీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆగస్టు 27న నిర్వహించనున్న గ్రామ సభలు/వార్డు సభలను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటు హక్కును పరిరక్షించే విధంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ వీసీ లో ఆర్డివో వెంకటేష్, ఏఈఆర్వోలు రవీందర్ రెడ్డి, రాజు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story