Warangal: బీజేపీ ఎంపీ మహేంద్ర భట్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి!
Warangal: మల్లికార్జున ఖర్గే సభ తర్వాత మైదాన శుద్ధీకరణను సమర్థించిన బీజేపీ ఎంపీ మహేంద్ర భట్‌పై చర్యలు తీసుకోవాలని వరంగల్ సీపీ శ్వేతకు కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఫిర్యాదు చేసింది.
Warangal: బీజేపీ ఎంపీ మహేంద్ర భట్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి!
వరంగల్, ఆగస్టు 31: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న బహిరంగ సభ అనంతరం హల్ద్వానీ రామ్‌లీలా మైదానంలో నిర్వహించినట్లు వెల్లడైన “శుద్ధీకరణ” హవన్ వివాదంపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మహేంద్ర భట్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత గారికి కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఆగస్టు 8న హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆగస్టు 10న అదే ప్రదేశంలో శ్రీరామ్ సేనకు చెందిన సంస్థ ఆధ్వర్యంలో “శుద్ధీకరణ” పేరుతో హవన్ నిర్వహించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనను ఖర్గే దళితుడిగా తనను అవమానించే చర్యగా అభివర్ణించారు. ఈ అంశం రాజ్యసభలోనూ ప్రస్తావనకు వచ్చింది.
ఈ వివాదం నేపథ్యంలో ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ శుద్ధీకరణ కార్యక్రమాన్ని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు మరింత రాజకీయ దుమారం రేపాయి. రామ్‌లీలా మైదానం కొన్ని నినాదాలతో “కలుషితమైందని”, అందుకే శుద్ధీకరణ నిర్వహించారని ఆయన పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దళితుల పట్ల వివక్షకు తావిచ్చే చర్యలను సమర్థించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించింది.
“రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కులను, దళితుల ఆత్మగౌరవాన్ని ఎవరూ కించపరిచే హక్కు లేదు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ కుల వివక్ష, అంటరానితనాన్ని ప్రోత్సహించే లేదా సమర్థించే చర్యలను ప్రజాస్వామ్య సమాజం సహించదు” అని చిలువేరు శ్రీనివాస్ పేర్కొన్నారు.
మహేంద్ర భట్‌పై వచ్చిన ఆరోపణలు, ఆయన చేసిన వ్యాఖ్యలు, హల్ద్వానీ ఘటనకు సంబంధించిన పూర్తి అంశాలపై సమగ్ర విచారణ జరిపి, ఎస్సీ–ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద వర్తించే నిబంధనలను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు.
దళితుల గౌరవాన్ని కాపాడటంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ముందుండి పోరాడుతుందని, దళితులపై వివక్షకు వ్యతిరేకంగా అవసరమైతే చట్టపరమైన అన్ని మార్గాల్లో పోరాటం కొనసాగిస్తామని చిలువేరు శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ, హనుమకొండ జిల్లా చైర్మన్ ఆరురి సాంబయ్య, జిల్లా బాధ్యులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




