Warangal: పోలీస్ అమరవీరుల త్యాగాలే నేటి ప్రశాంతతకు పునాది సీవీ ఆనంద్!
Warangal: వరంగల్ పర్యటనలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్ అమరవీరుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు, పరిష్కారాల కోసం ‘TG-VEER’ పోర్టల్ ప్రారంభించారు.
Warangal: పోలీస్ అమరవీరుల త్యాగాలే నేటి ప్రశాంతతకు పునాది సీవీ ఆనంద్!
Warangal: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పర్యటనలో భాగంగా తెలంగాణ డీజీపీ శ్రీ సీవీ ఆనంద్, నక్సలిజంపై పోరాటంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 28 మంది పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల కుటుంబాల సమస్యలను పరిష్కరించేందుకు ‘TG-VEER’ పేరుతో ప్రత్యేక గ్రీవెన్స్ పోర్టల్‌ను డీజీపీ ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా అమరవీరుల కుటుంబ సభ్యులు తమకు సంబంధించిన ఆర్థిక సహాయం, ఎక్స్‌గ్రేషియా, కారుణ్య నియామకాలు, ఇంటి స్థలాల కేటాయింపు, స్థలాల రిజిస్ట్రేషన్/టైటిల్ సమస్యలు, పెన్షన్, ఇతర సంక్షేమ పథకాలు మరియు ప్రభుత్వ పరంగా అందాల్సిన ప్రయోజనాలకు సంబంధించిన ఫిర్యాదులను ఒకే వేదిక ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
అమరవీరుడి ఉద్యోగ వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, ఇప్పటివరకు అందిన ప్రయోజనాలు, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు (GOs) తదితర సమాచారాన్ని కూడా ఈ పోర్టల్‌లో సమగ్రంగా పొందుపరచనున్నారు. యూనిట్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నతాధికారులు ఫిర్యాదులను పర్యవేక్షించి, వాటి పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఈ పోర్టల్‌ను రూపొందించారు.
ఈ సందర్భంగా డీజీపీ క్యూఆర్ కోడ్‌తో కూడిన కుటుంబ కార్డులను అమరవీరుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా నేరుగా TG-VEER గ్రీవెన్స్ పోర్టల్‌కు వెళ్లి తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చు.
ఈ పోర్టల్‌ను రూపొందించిన ఎస్‌ఐబీ అధికారులు రాష్ట్రంలోని అన్ని యూనిట్లకు వెంటనే సమాచారం అందించి, ఆయా యూనిట్ల పరిధిలోని అన్ని పోలీస్ అమరవీరుల కుటుంబాల నుంచి సమస్యలు, ఫిర్యాదులను సేకరించి, వాటిపై సమగ్ర నివేదికను సమర్పించాలని డీజీపీ ఆదేశించారు.
ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులు తమకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను డీజీపీ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఎక్స్‌గ్రేషియా, ఆర్థిక సహాయం, ఇంటి స్థలాల కేటాయింపు, స్థలాల రిజిస్ట్రేషన్ మరియు టైటిల్ సమస్యలు, పెన్షన్, ఇతర సంక్షేమ అంశాలకు సంబంధించిన సమస్యలను వివరించారు.
కుటుంబ సభ్యులు తెలిపిన సమస్యలను డీజీపీ సావధానంగా విని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అమరవీరుల కుటుంబాలకు అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ, వారి సమస్యలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి శ్వేత ఐపీఎస్ను డీజీపీ ఆదేశించారు.
*ఈ సందర్భంగా డీజీపీ శ్రీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, తన వృత్తి జీవిత ప్రారంభ దశలో నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో వరంగల్‌లో విధులు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను కోల్పోయిన పోలీస్ అధికారులు, సిబ్బంది కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనని తెలిపారు.
నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను, ఎదురుకాల్పులు, దాడులు, ఆకస్మిక దాడులు వంటి సవాళ్లను గుర్తుచేస్తూ, నేడు ఈ ప్రాంతంలో నెలకొన్న ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతలకు పోలీస్ అమరవీరుల త్యాగాలే ప్రధాన పునాది అని డీజీపీ పేర్కొన్నారు. విధి నిర్వహణకు తమ ప్రాణాల కంటే ప్రాధాన్యతనిచ్చి త్యాగాలు చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించిన డిజిపి నిర్మాణంలో ఉన్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనం పరిశీలనఅనంతరం నేర సమీక్ష సమావేశానికి వెళ్లే ముందు డీజీపీ శ్రీ సీవీ ఆనంద్ నిర్మాణంలో ఉన్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్న నేపథ్యంలో, వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి శ్వేత ఐపీఎస్ కొనసాగుతున్న పనుల వివరాలను డీజీపీకి వివరించారు.
కొత్త పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందేలా భవనం రూపకల్పన ఉండాలని డీజీపీ సూచించారు. అంతర్గత పరిపాలనా సామర్థ్యం పెంపొందించడంతో పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి, మెరుగైన నిఘా వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు.
కార్యాలయ ప్రాంగణంలో ఉపయోగంలో లేని, శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణాలను తొలగించాలని, కొత్త కార్యాలయ భవనానికి వెళ్లే అంతర్గత రహదారులను మెరుగుపరచాలని డీజీపీ సూచించారు.
ప్రజలకు కార్యాలయం సులభంగా కనిపించేలా, సౌకర్యవంతంగా చేరుకునేలా మెరుగైన ప్రాప్యత, స్పష్టమైన దృశ్యమానత ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఐ జీ ఇంటెలిజెన్స్ కార్తికేయ, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఎస్పీ సింధు శర్మ, అడిషనల్ కలెక్టర్ రవి, అడిషనల్ ఎస్పీ లు వినోద్, శ్యాం బాబు పాల్గొన్నారు.




