Warangal: భద్రకాళీ ఆలయంలో వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు!

Warangal: వరంగల్ భద్రకాళీ దేవస్థానంలో పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతితో ముగిశాయి. శ్రావణ పౌర్ణమి రక్షాబంధనం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 28 Aug 2026 6:28 PM IST
Warangal
X

Warangal: భద్రకాళీ ఆలయంలో వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు!

Warangal: వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో గత మూడు రోజులుగా జరుపబడుతున్న పవిత్రోత్సవాలు నేటితో ముగిశాయి. ఈ రోజు పవిత్రోత్సవక్రతు మహాపూర్ణాహుతి జరుపబడిన అనంతరం అమ్మవారికి పవిత్ర ధారణం జరిపి భక్తులను దర్శనానికి అనుమతించారు.

వందలాది మంది భక్తులు పవిత్రలు అలంకరింపబడిన అమ్మవారిని దర్శించి తన్మయత్వంతో పులకించిపోయారు. భద్రకాళీ శరణం మమ అనే నామస్మరణతో దేవస్థానం మారుమ్రోగింది.

సంవత్సరం మొత్తంలో అమ్మవారికి జరుపవలసిన పూజారాధనలలో అర్చకులవల్లగానీ, భక్తుల వల్లగానీ, అధికారుల వల్లగాని సంభవించిన లోటుపాట్లు తెలిసీతెలియక జరిగిన అపచారములవల్ల సంక్రమించిన పాపము తొలగిపోయి శుద్ధిసంపాదనంతో పాటు అమ్మవారికి జరుపబడిన సంవత్సర ఆరాధనా సంపూర్ణ ఫలప్రాప్తి జరిగి లోకకళ్యాణం కోసం ఈ పవిత్రోత్సవాలను దేవాలయాలలో జరుపుతారు.

దేశం మొత్తంలో శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయం వైదికాగమ శాస్త్రానుసారం జరుపబడే పూజావిధానానికి అథారిటీగా ప్రజలు చెప్పుకుంటారు. ఇక్కడ జరిగే ఏ క్రతువైనా, ఉత్సవమైనా, ఆరాధనకైనా శాస్త్రాధారం తప్పకుండా ఉండితీరుతుంది. కాబట్టి వైదిక ఆగమ అనుయాయులు భద్రకాళీ గుడి సంప్రదాయాన్నే ఆచరణలో పెట్టుకుంటారు.

ఈ రోజు శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన కార్యక్రమాన్ని వేలాదిమంది భక్తులకు పురోహితులు రక్షాబంధాన్ని జరిపారు. శ్రావణ పౌర్ణమి రోజున పురోహితుడు ప్రజలకు రక్షాబంధనాన్ని జరపాలని భవష్య పురాణంలో ఉన్నట్లు ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు.

ఇంట్లో ఆడపచులతో ఆచారం ప్రకారం జరుపుకున్ననూ శాస్త్ర పద్ధతిని అనుసరించి మంత్రోచ్చారణతో పురోహితుడి చేత రక్షాబంధనం జరుపుకోవడం భక్తులు అదృష్టంగా భావించారు. ఈరోజు శుక్రవారం కూడా కావడంతో ఉదయం నుండే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story