Palakurthi: పాలకుర్తి సాగునీటి పనులను వేగవంతం చేయాలి ఎమ్మెల్యే

Palakurthi: దేవాదుల ప్రాజెక్టుపై హనుమకొండలో సమీక్ష. చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.

S MAHENDER, PALAKURTHI
Updated on: 11 Aug 2026 8:20 PM IST
Palakurthi
X

Palakurthi: పాలకుర్తి సాగునీటి పనులను వేగవంతం చేయాలి ఎమ్మెల్యే

పాలకుర్తి: హనుమకొండ చింతగట్టులోని CE వరంగల్ ఇరిగేషన్ కార్యాలయంలో జే.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (JCR-DLIS) పై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే లతో ENC ఓ.వి. రమేష్ బాబు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సహచర ఎమ్మెల్యేలతో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన సాగునీటి సమస్యలు, దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతి, పెండింగ్‌లో ఉన్న పనులపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గానికి ఎంతో కీలకమైన పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. రిజర్వాయర్ పనులు పూర్తయితే నియోజకవర్గంలోని రైతులకు సాగునీటి వసతి మరింత మెరుగుపడి, వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.

అదేవిధంగా దేవరుప్పుల మండలం ధర్మగడ్డ తండా సమీపంలో కాలువ క్లియరెన్స్ లేకపోవడంతో రైతులకు సాగునీరు అందడం లేదని ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి కాలువలో ఉన్న అడ్డంకులను తొలగించి, రైతులకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే పాలకుర్తి నియోజకవర్గంలోని దేవాదుల కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టు ప్రాంతాల్లో నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ఎమ్మెల్యే లేవనెత్తిన సమస్యలపై స్పందించిన ENC ఓ.వి. రమేష్ బాబు, సంబంధిత ఇరిగేషన్ అధికారులకు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధర్మగడ్డ తండా సమీపంలోని కాలువ సమస్యను పరిశీలించి క్లియరెన్స్ పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అదేవిధంగా పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ పనుల పురోగతిని వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత పనులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు.

రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గంలో సాగునీటి వనరుల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story