Warangal: చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే నాయిని
Warangal: చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
Warangal: చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే నాయిని
హనుమకొండ: చేనేత కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, కళాత్మక నైపుణ్యానికి ప్రతీక అన్నారు. తెలంగాణలో చేనేత రంగానికి విశిష్టమైన చరిత్ర ఉందని, ముఖ్యంగా వరంగల్ ప్రాంతం దేశవ్యాప్తంగా చేనేత కళకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, వారి జీవనోపాధి మెరుగుపడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ విస్తరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న డిజైన్లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అలాగే ముడి సరుకు, రుణ సౌకర్యాలు, బీమా, సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చేనేత కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ముఖ్యంగా హనుమకొండ జిల్లాలోని చేనేత కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని చేనేత కార్మికుల అభ్యున్నతికి అవసరమైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత రంగానికి చేయూతనిచ్చే విధంగా డిపిఆర్ తయారుచేసి ఇవ్వాలని, డిపిఆర్ ను సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని పేర్కొన్నారు. చేనేత రంగాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చేనేతను కాపాడుకుంటూ చేనేత కార్మికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలను ఎమ్మెల్యే తెలియజేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచించిన విధంగా చేనేత సంఘం ప్రతినిధులు చేనేత సంక్షేమానికి డిపిఆర్ తయారుచేసి అందించాలని తెలియజేశారు.
అనంతరం చేనేత కార్మికులను ఘనంగా సన్మానించడంతో పాటు చేనేత రంగంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబర్చిన వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించి చేనేత వస్త్రాలతో సన్మానించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల విక్రయ స్టాల్ ను సందర్శించి చేనేత చీరను ఎమ్మెల్యే కొనుగోలు చేశారు.
ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ జయరాజ్, ఏడీ విజయలక్ష్మి, చేనేత సంఘాల ప్రతినిధులు, చేనేత కార్మికులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




