Mulugu: వినాయక చవితి వేడుకల్లో విద్యుత్ భద్రతే ముఖ్యం: ఎస్ఈ బిక్షపతి
Mulugu: వినాయక చవితి వేడుకలు, నిమజ్జన సమయంలో విద్యుత్ భద్రత పాటించాలని ములుగు సర్కిల్ ఎస్ఈ బి.బిక్షపతి సూచించారు.
Mulugu: వినాయక చవితి వేడుకల్లో విద్యుత్ భద్రతే ముఖ్యం: ఎస్ఈ బిక్షపతి
ములుగు జిల్లా: గణేష్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక తనిఖీలు, విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ములుగు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి.బిక్షపతి స్పష్టం చేశారు.
ఈ నెల 14న వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటు, విద్యుత్ అలంకరణలు, విగ్రహాల తరలింపు, నిమజ్జనం సమయంలో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రజలు, భక్తులు, మండప నిర్వాహకులు, విద్యుత్ ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
“పండుగ వేడుకల్లో ఆనందం ఎంత ముఖ్యమో, ప్రతి ఒక్కరి ప్రాణ భద్రత అంతకంటే ముఖ్యం. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉన్నందున విద్యుత్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి” అని ఎస్ఈ స్పష్టం చేశారు.
నిమజ్జన మార్గాల్లో విద్యుత్ సిబ్బందికి ప్రత్యేక సూచనలు
విగ్రహాల ఎత్తు, ట్రక్కులు, క్రేన్ల ఎత్తును దృష్టిలో ఉంచుకుని నిమజ్జన మార్గాలను విద్యుత్ సిబ్బంది ముందుగానే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు.
* మార్గంలోని విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలను తనిఖీ చేయాలి.
* ప్రమాదకరంగా లేదా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లను గుర్తించి అవసరమైన సాంకేతిక చర్యలు చేపట్టాలి.
* నిమజ్జన మార్గాల్లో మార్గాల పరిశీలన పూర్తి చేసి, సంబంధిత అధికారుల ద్వారా ముందస్తుగా ధృవీకరించాలి.
* క్రేన్లు, భారీ వాహనాలు, ఎత్తైన విగ్రహాలు విద్యుత్ లైన్లకు తగలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రజలకు, మండపం నిర్వహులకు పలు సూచనలు.
విద్యుత్ లైన్లకు దగ్గరగా గణేష్ విగ్రహాలు, క్రేన్లు, మెటల్ ఫ్రేములు లేదా ఇతర అలంకరణ సామగ్రిని తీసుకెళ్లడం ప్రమాదకరమని, జాగ్రత్తగా, దూరంగా తీసుకువెళ్లాలని కోరుతున్నారు.
విద్యుత్ తీగను నేరుగా తాకకపోయినా దగ్గరగా వెళ్లడం వల్ల విద్యుత్ ప్రసరణ/ఇండక్షన్ కారణంగా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి విద్యుత్ లైన్లకు సురక్షిత దూరం పాటించడం తప్పనిసరి. మండపాలు, నిమజ్జన మార్గాలు, ప్రధాన రహదారుల్లో ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ఎక్కడైనా తెగిపోయిన విద్యుత్ తీగలు , లూజ్ లైన్లు,విద్యుత్ స్తంభాలు, ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే ప్రజలు వాటిని తాకకూడదు.
వెంటనే 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరుతున్నారు.
గణేష్ మండపాల నిర్వాహకులు విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేసేటప్పుడు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలను పాటించాలని చెప్పారు.
* విద్యుత్ కనెక్షన్‌ను అధికారిక విద్యుత్ సిబ్బంది ద్వారానే పొందాలి.
* నాణ్యమైన, ISI మార్క్ కలిగిన వైర్లు, పరికరాలను మాత్రమే ఉపయోగించాలి.
* సరైన సామర్థ్యం కలిగిన MCB/రక్షణ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి.
* జాయింట్లు, దెబ్బతిన్న వైర్లు, టేప్‌తో తాత్కాలికంగా చేసిన కనెక్షన్లను ఉపయోగించరాదు.
* విద్యుత్ వైరింగ్‌ను నీరు, తేమకు దూరంగా ఉంచాలి.
* వర్షం పడినప్పుడు తడిసిన వైర్లు, స్విచ్‌లు, విద్యుత్ పరికరాలను తాకరాదు.
* పిల్లలను విద్యుత్ స్తంభాలు, వైర్లు, విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి.
* మండపాల వద్ద మెటల్ నిర్మాణాలు విద్యుత్ లైన్లకు దగ్గరగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కేబుల్ వైర్లపై ప్రత్యేక దృష్టి
టీవీ, ఇంటర్నెట్ తదితర కేబుల్ వైర్లు విద్యుత్ స్తంభాలపై చిందరవందరగా లేదా తక్కువ ఎత్తులో వేలాడుతూ ఉండకుండా సంబంధిత కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
పండుగ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి వైర్లను ప్రత్యేకంగా తనిఖీ చేసి ప్రమాదకర పరిస్థితులను తొలగించాలని సూచించారు.
విద్యుత్ భద్రత , ప్రతి ఒక్కరి బాధ్యత
విద్యుత్ భద్రతా నియమాలు పాటిస్తూ, టీజీఎన్పీడీసీఎల్ కు సహకరించి వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందంగా, ముఖ్యంగా ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు లేకుండా సురక్షితంగా నిర్వహించుకోవాలని ప్రజలకు ఎస్ఈ విజ్ఞప్తి చేశారు.




