Mulugu: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి: ఆర్డీవో కృష్ణవేణి

Mulugu: ములుగు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార దినాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీవో కృష్ణవేణి కోరారు.

PONNALA SWAMY, MULUGU
Published on: 5 Sept 2026 3:27 PM IST
Mulugu
X

Mulugu: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి: ఆర్డీవో కృష్ణవేణి

ములుగు జిల్లా: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార దినాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీవో కృష్ణవేణి కోరారు.

శనివారం ప్రత్యేక ప్రచార దినం సందర్భంగా గోవిందరావుపేట మండలంలోని గోవిందరావుపేట, చల్వాయి, తాడ్వాయి మండలంలోని తాడ్వాయి, కాటాపూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆర్డీవో కృష్ణవేణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఓటర్ల ముసాయిదా జాబితాలు, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి బూత్ స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, వివరాల సవరణలకు సంబంధించిన దరఖాస్తులు, అభ్యంతరాలను నిర్ణీత నమూనా పత్రాల్లో స్వీకరించాలని ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్కరూ ఓటరుగా నమోదు కాకుండా మిగిలిపోకుండా బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

సెప్టెంబర్ 6, 12, 13 తేదీల్లో కూడా ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో బూత్ స్థాయి అధికారులు సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండి ఓటర్లకు సహకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు తమ పోలింగ్ కేంద్రాలను సందర్శించి నిర్ణీత గడువులో దరఖాస్తులు, అభ్యంతరాలను సమర్పించాలని కోరారు.

నూతన ఓటరు నమోదుకు నమూనా–6, ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించేందుకు నమూనా–7, వివరాల సవరణకు నమూనా–8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2026 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ యువకులు నిర్ణీత ప్రకటన పత్రంతోపాటు నమూనా–6ను సమీపంలోని బూత్ స్థాయి అధికారికి సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

ప్రజల భాగస్వామ్యంతో తప్పులులేని సమగ్ర ఓటర్ల జాబితా రూపుదిద్దుకుంటుందని, తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆర్డీవో కృష్ణవేణి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట తహసీల్దార్ సృజన్ కుమార్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ నితీష్, తాడ్వాయి సీనియర్ అసిస్టెంట్ నాగేంద్ర, బూత్ స్థాయి అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story