Mulugu: గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ: మంత్రి సీతక్క!

Mulugu: ములుగు జిల్లా ఏటూరునాగారం రామన్నగూడెం వద్ద గోదావరి వరద ఉధృతిని మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 1 Aug 2026 7:09 PM IST
Mulugu
X

Mulugu: గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ: మంత్రి సీతక్క!

ములుగు: గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పిస్తున్నామని, వరదలపై జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తతో ముందస్తు చర్యలతో నష్టాలను నివారణ చేయడం జరిగిందని, లోతట్టు ప్రాంత ప్రజలకు పునరావాసం, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.

శనివారం ఏటూరు నాగారం మండలం కేంద్రం లోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నది వరద ప్రవాహాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పిఓ లెనిన్ వస్సల్ టోప్పో లతో కలసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ గత రెండు రోజులుగా తెలంగాణ తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉప్పొంగుతున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు.

జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటిడిఏ పిఓ, సాగునీటి శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారుల తో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని అన్నారు. గత రెండేళ్లుగా ములుగు జిల్లాలో ప్రత్యేక వరద నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసి, వాగులు, గోదావరి పరివాహక ప్రాంతాలు, ముంపు గ్రామాల్లో ప్రత్యేక అధికారులను నియమించి పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామని వివరించారు.

గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకున్నప్పటికీ ముందస్తు చర్యల కారణంగా ఎలాంటి నష్టం జరగలేదన్నారు. రెండు నెలల క్రితమే గోదావరి పరివాహక ప్రాంతాల్లో జిల్లా ఉన్నత అధికారులతో, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించి అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. గతంలో రామన్నగూడెంలోకి వరద నీరు చేరేదని, ఈసారి ముందస్తు చర్యలతో ఆ ప్రమాదాన్ని నివారించగలిగామని పేర్కొన్నారు.

రామన్నగూడెం, మంగపేట ప్రాంతాల్లో కరకట్ట నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, సుమారు 800 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రజలు వరదలు, వాగులు ఉప్పొంగిన సమయంలో వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వర్షాల సమయంలో అడవుల్లోకి పశువులను మేపేందుకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. 2022, 2023 సంవత్సరాల్లో గోదావరి, జంపన్నవాగు వరదల వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మిగిలిన కరకట్ట పనులను కూడా పూర్తి చేసి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పిస్తామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలను గుర్తించి రెండో విడతలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏ ఎస్ పి మనన్ భట్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి,ఆర్డీవో కృష్ణవేణి, తహసిల్దార్, ఎం పి డి ఓ, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story