Mulugu: నూతన రేషన్ కార్డు పేదల సామాజిక గౌరవానికి ప్రతీక: మంత్రి సీతక్క!

Mulugu: ములుగులో మంత్రి సీతక్క, కలెక్టర్ హేమంత్ సహదేవరావులు 2,430 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. పింఛన్ల దరఖాస్తు గడువు మరో 15 రోజులు పొడిగించినట్లు మంత్రి తెలిపారు.

PONNALA SWAMY, MULUGU
Published on: 1 Sept 2026 11:13 PM IST
Mulugu
X

Mulugu: నూతన రేషన్ కార్డు పేదల సామాజిక గౌరవానికి ప్రతీక: మంత్రి సీతక్క!

ములుగు: పేదల సామాజిక గౌరవానికి నూతన రేషన్ కార్డు ప్రతీకగా నిలుస్తుందని, సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.

మంగళవారం ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి అనసూయ సీతక్క ములుగు, మల్లంపల్లి మండలాల లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ములుగు మండలానికి 1,809, మల్లంపల్లి మండలానికి 621 చొప్పున మొత్తం 2,430 నూతన రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ, రేషన్ కార్డులు లేని కారణంగా అర్హులైన పేదలు సన్నబియ్యం పథకానికి దూరం కావద్దనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం నూతన కార్డులను మంజూరు చేస్తోందని తెలిపారు. ఈ సంవత్సరంలో 12,802 నూతన రేషన్ కార్డుల ద్వారా 36,405 మంది కుటుంబ సభ్యులకు సన్నబియ్యం పథకం ప్రయోజనాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 15 లక్షలకు పైగా నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసినట్లు వివరించారు.

మార్కెట్‌లో సన్నబియ్యం కొనుగోలు చేయడం పేద కుటుంబాలకు భారంగా మారిందని, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందించడంతో ఆ కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతోందని అన్నారు.

గతంలో పెద్ద పరిమాణంలో ఉండే రేషన్ కార్డులను తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఉండేవని, ప్రస్తుతం జేబులో సులభంగా తీసుకెళ్లగలిగేలా స్మార్ట్ కార్డులను రూపొందించి అందిస్తున్నామని తెలిపారు. రేషన్ సరుకులు పొందడానికే కాకుండా వివిధ ధ్రువపత్రాల జారీ, ఆరోగ్యశ్రీ తదితర అవసరాలకు కూడా రేషన్ కార్డు ఉపయోగపడుతుందని అన్నారు. అర్హులైన పేదలకు ప్రాధాన్యమిస్తూ నూతన కార్డులను అందిస్తున్నామని, ఇంకా కార్డులు అందని అర్హులకు రానున్న రోజుల్లో అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

మారుమూల ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పింఛన్ల దరఖాస్తుల గడువును మరో 15 రోజులు పొడిగించినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 4 లక్షల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తిస్తామని తెలిపారు.

అర్హులైన వారు తహసీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు లేదా మీ సేవా కేంద్రాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అర్హులకు దరఖాస్తు ప్రక్రియలో సహకరించాలని కోరారు.

ములుగు నియోజకవర్గానికి ఇప్పటివరకు 5 వేలకు పైగా ఇండ్లను లబ్ధిదారులకు అందించామని, ఇంకా అనేక పేద కుటుంబాలకు ఇండ్ల అవసరం ఉందని తెలిపారు. సర్వేలో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలు ములుగులో అధికంగా ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. రెండో విడతలో అర్హులైన పేదలకు ఇండ్లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, గుడిసెల్లో నివసించే అర్హులైన కుటుంబాల వివరాలతో జాబితాలను ఖరారు చేసి పంపించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టే లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు సిమెంట్ ధరల నియంత్రణపై ప్రభుత్వం పలు సిమెంట్ కంపెనీలతో చర్చలు జరుపుతోందని తెలిపారు.

సన్నబియ్యం పంపిణీ, అర్హులైన కుటుంబాలకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాల ద్వారా పేదలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, డీసీఎస్ఓ ఫైజల్ హుస్సేని, డీఎం కృష్ణవేణి, తహసీల్దార్లు, నూతన రేషన్ కార్డుల లబ్ధిదారులు, రేషన్ డీలర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story