Mahabubabad: సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శక పోలీసింగ్..ఎస్పీ డా. శబరీష్!

Mahabubabad: మహబూబాబాద్‌లో జిల్లా ఎస్పీ డా. శబరీష్ నేతృత్వంలో సమీక్ష. సిసిటిఎన్‌ఎస్, ఇ-సాక్ష్య వినియోగం, గణేష్ ఉత్సవాల జియో టాగింగ్ మరియు బందోబస్తుపై ఆదేశాలు.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 3 Sept 2026 8:19 AM IST
Mahabubabad
X

Mahabubabad: సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శక పోలీసింగ్..ఎస్పీ డా. శబరీష్!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పోలీసింగ్‌లో డిజిటల్ వ్యవస్థల సమర్థ వినియోగంపై ఇచ్చిన ఆదేశాల అమలుపై ఈ సమావేశంలో ప్రధానంగా సమీక్షించారు.

ఈ సమావేశంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, స్టేషన్ రైటర్లు, డీసీఆర్‌బీ, ఐటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లలో CCTNS, e-Sakshya, e-Summons తదితర సాంకేతిక వ్యవస్థల వినియోగం, కేసులకు సంబంధించిన వివరాల అప్‌డేటింగ్, పెండింగ్ ప్రక్రియలు, సాంకేతిక సమస్యల పరిష్కారం తదితర అంశాలను ఎస్పీ సమీక్షించారు.

CCTNSలో FIR నమోదు నుంచి దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రతి దశకు సంబంధించిన వివరాలను సకాలంలో, కచ్చితంగా అప్‌డేట్ చేయాలని ఎస్పీ ఆదేశించారు. పెండింగ్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు గుర్తించి పూర్తి చేయాలని, సాంకేతిక సమస్యలు ఎదురైతే ఐటీ సెల్, DCRB సహకారంతో వెంటనే పరిష్కరించాలని సూచించారు.

e-Sakshyaలో కేసులకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు, సాక్ష్యాలు, రిపోర్టులను సకాలంలో నమోదు చేయాలని, e-Summons జారీ, సర్వీస్ మరియు సంబంధిత అప్‌డేట్లను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ స్థాయిలో సాంకేతిక వ్యవస్థలను కేవలం నమోదు కోసం కాకుండా దర్యాప్తు ప్రక్రియను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మరియు వేగవంతంగా చేయడానికి వినియోగించాలని సూచించారు.

అన్ని పెండింగ్ కేసులను గుర్తించి త్వరితగతిన పూర్తి చేయాలని, కేసులు ఆలస్యం కావడానికి గల కారణాలను అధికారులు గుర్తించాలని ఎస్పీ ఆదేశించారు. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో చార్జ్‌షీట్‌లు, ఫైనల్ రిపోర్టులను సకాలంలో దాఖలు చేయాలని సూచించారు. రిపీటెడ్ ఆఫెండర్లను గుర్తించి అవసరమైన చోట రౌడీ షీట్లు తెరవడం, ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేయడం వంటి ప్రక్రియలను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు.

POCSO కేసుల్లో నిర్ణీత సమయంలో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని, NDPS కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను త్వరితగతిన అదుపులోకి తీసుకోవాలని సూచించారు. మిస్సింగ్ కేసులను ప్రత్యేకంగా సమీక్షించి, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

ప్రతి పోలీస్ స్టేషన్‌లో Zero FIRలను ప్రతిరోజూ పరిశీలించి, వచ్చిన వెంటనే నిబంధనల ప్రకారం నమోదు చేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే Compliance Reportsను నిర్ణీత సమయంలో పూర్తి చేసి సమర్పించాలని, ఉన్నతాధికారుల ఆదేశాలపై తీసుకున్న చర్యలను సకాలంలో అప్‌డేట్ చేయాలని సూచించారు. లోక్ అదాలత్ కేసులు, e-Petty Cases, Drunk & Drive, e-Challan కేసుల వివరాలను కూడా సకాలంలో అప్‌డేట్ చేసి పెండెన్సీ లేకుండా చర్యలు పూర్తి చేయాలని ఆదేశించారు.

Dial-112 ద్వారా వచ్చే అత్యవసర కాల్స్‌కు సత్వరమే స్పందించి, నిర్ణీత సమయంలో సంఘటనా స్థలానికి చేరుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ప్రతి 112 కాల్‌పై స్పందన సమయాన్ని పర్యవేక్షిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన పోలీస్ సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం రానున్న గణేష్ ఉత్సవాల నిర్వహణపై ఎస్పీ అధికారులతో సమీక్షించారు. గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపనకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలను నిర్వాహకులకు ముందుగానే తెలియజేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి, విగ్రహాల ప్రతిష్ఠాపన, ఊరేగింపు, నిమజ్జనం తదితర అంశాలపై ముందస్తుగా సమన్వయం చేయాలని సూచించారు.

గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన జరిగే ప్రదేశాలను ముందుగానే గుర్తించి Geo-Tagging చేయాలని, ప్రతి విగ్రహానికి సంబంధించిన వివరాలను నమోదు చేసి పోలీస్ రికార్డుల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ భద్రత, శబ్ద కాలుష్య నిబంధనలు, ఊరేగింపు మరియు నిమజ్జన మార్గాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

గణేష్ ఉత్సవ కమిటీలు, ప్రజలు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు, ప్రతి ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం, ప్రజలకు వేగవంతమైన పోలీస్ సేవలు అందించడం, రానున్న గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించడం జిల్లా పోలీసుల ప్రధాన ప్రాధాన్యతలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ స్పష్టం చేశారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD

Next Story