Mahabubabad: మహబూబాబాద్‌లో గంజాయిపై ఎస్పీ ఉక్కుపాదం
Mahabubabad: ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ ఆదేశాలతో బయ్యారం, గార్ల పరిధిలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు, డ్రోన్ గస్తీ.
Mahabubabad: మహబూబాబాద్‌లో గంజాయిపై ఎస్పీ ఉక్కుపాదం
మహబూబాబాద్: ఎస్పీ డా. శబరీష్ IPS ఆదేశాల మేరకు బయ్యారం సర్కిల్ పరిధిలో గంజాయి వినియోగానికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక రాత్రి గస్తీ, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPS ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు, యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు బయ్యారం సర్కిల్ పరిధిలో ప్రత్యేక రాత్రి గస్తీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బయ్యారం సీఐ రవీందర్ ఆధ్వర్యంలో బయ్యారం ఎస్సై ప్రశాంత్, గార్ల ఎస్సై సాయి కుమార్ మరియు పోలీసు సిబ్బంది సంయుక్తంగా అర్ధరాత్రి వేళల్లో గంజాయి వినియోగానికి ఆస్కారం ఉన్న అనుమానిత ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు, గ్రామాల శివార్లు, అటవీ ప్రాంతాలు, చెట్ల పొదలు, ఖాళీ స్థలాలు మరియు జనసంచారం తక్కువగా ఉండే అంతర్గత ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ నిర్వహించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
గార్ల-బయ్యారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎల్. రవీందర్ ఆధ్వర్యంలో, బయ్యారం ఎస్సై ప్రశాంత్ బాబు, గార్ల ఎస్సై సాయి కుమార్, సివిల్ డ్రెస్సుల్లో ఉన్న ప్రత్యేక వాహనాలపై అనుమానిత ప్రాంతాల్లో రహస్య గస్తీ నిర్వహిస్తూ, గంజాయి సేవించడం, విక్రయించడం, రవాణా చేయడం వంటి కార్యకలాపాలపై నిఘా పెట్టారు. అదేవిధంగా గుంపులుగా సమావేశమవడం, వికృతంగా ప్రవర్తించడం, రహస్య ప్రదేశాల్లో గుమికూడటం వంటి చర్యలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ ఎల్. రవీందర్ మాట్లాడుతూ, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగానికి పాల్పడే వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మత్తు పదార్థాలకు బానిసైన యువతకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ సెంటర్ ద్వారా కౌన్సెలింగ్, వైద్య చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు.
జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక బృందాలతో నిరంతర గస్తీలు, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గంజాయి వినియోగదారులు, విక్రయదారులు మరియు సరఫరాదారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా మహబూబాబాద్ జిల్లా పోలీసు హెల్ప్‌లైన్ 8712656999 కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మత్తు పదార్థాల నిర్మూలనకు ఇలాంటి ప్రత్యేక రాత్రి గస్తీలు, ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.




