Station Ghanpur: ప్రతీ ఎకరానికి సాగు నీరే లక్ష్యం.. GO 97 రద్దు చేయాలి!
Station Ghanpur: స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. 6 నెలల్లో దేవాదుల 100% పూర్తి చేస్తామని హామీ.
Station Ghanpur: ప్రతీ ఎకరానికి సాగు నీరే లక్ష్యం.. GO 97 రద్దు చేయాలి!
Station Ghanpur: స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుండి రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు పంట కాలువ ద్వారా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు సాగు నీరు విడుదల చేశారు. ఈ సందర్బంగా తూము వద్ద గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు.
అనంతరం స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ.
ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందించడమే లక్ష్యం.
2023 నవంబర్ లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లో దేవాదుల కింద ఉన్న రిజర్వాయర్ల ద్వారా ప్రతీ గ్రామానికి సాగు నీరు అందించాలనే ఏకైక ఎజెండాతో పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్లలో నీటిని నింపేందుకు గత రెండు నెలలుగా ప్రతీ రోజు ఎప్పటికప్పుడు పంపింగ్ ను పరిశీలస్తూ, అధికారులతో మాట్లాడుతూ గోదావరి నుండి నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపి రైతుల పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని దానికి ఫలితాంగానే నేడు దేవాదుల కింద ఉన్న అన్ని రిజర్వాయర్ల నుండి సాగు నీరు విడుదల చేస్తున్నామని అన్నారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి గోదావరి జలాలు తీసుకువచ్చి ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందించడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే 6నెలల్లో 100శాతం దేవాదుల పనులను పూర్తి చేసి నియోజకవర్గంలోని పూర్తి ఆయకట్టుకు సాగు నీరు అందిస్తానని స్పష్టం చేశారు.
అందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజలు, రైతులు, నాయకులు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. గతంలో సాగు నీటి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నేను నాటిన మొక్క నేడు మహా వృక్షం అయి ఉమ్మడి వరంగల్ జిల్లాకే పెద్ద దిక్కుగా మారడం నా రాజకీయ జీవితంలో నాకు అత్యంత సంతృప్తి ఇచ్చే అంశం అని బావోద్వేగానికి లోనయ్యారు. ఘనపూర్ రిజర్వాయర్ కింద పూర్తి ఆయకట్టుకు రెండు పంటలకు సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.
బిఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి....
10ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణను ఏ రకంగా దోచుకుందో, తెలంగాణను ఏ రకంగా బ్రష్టు పట్టించిందో ప్రజలందరికి తెలుసని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించి పూర్తి చేశారని ఆ తర్వాత నాణ్యత లోపం వల్ల మెడిగడ్డ కుంగిపోయిందని తెలిపారు. మెడిగడ్డ కుంగిపోయిన సమయంలో కూడా కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నాడని అందులో ఏమైనా అనుమానాలు ఉంటే అప్పుడే ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మెడిగడ్డ నుండి 1టీఎంసి కూడా ఎత్తిపోయకుండా వరుసగా రెండు సంవత్సరాలు దేశంలోనే అత్యంత ఎక్కువ ధాన్యం దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని గుర్తుచేశారు. బిఆర్ఎస్ నాయకులు ధరణిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ భూములు, అసైండ్ భూములు, ప్రయివేట్ భూములను కోళ్లగొట్టారని, వందల ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టి వేల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. 2014కు ముందు కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తులు ఎన్ని....? ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఏ విధంగా వచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
అనేక అవినీతి, అక్రమాల కేసులు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ నాయకులే ఈ రోజు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. స్వయంగా కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీపై, బిఆర్ఎస్ నాయకులపై విపరీతమైన అవినీతి ఆరోపణలు చేస్తుందని, బిఆర్ఎస్ పార్టీకి ఉన్న 1400కోట్ల పార్టీ ఫండ్ కూడా అక్రమంగా వచ్చేందే అని దానిని వెంటనే ఉద్యమకారులకు పంచాలని డిమాండ్ చేస్తుందని బిఆర్ఎస్ నాయకులకు దమ్ముంటే కవిత చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
అక్రమంగా సంపాదించిన డబ్బుతో యుట్యూబ్ ఛానల్స్ కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై దుర్మార్గంగా నీచ స్థాయికి దిగజారి అబద్దపు వార్తలను ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు.
జీవో 97ను రద్దు చేయాలి.
గతంలో విద్యా శాఖ మంత్రిగా పని చేసిన వ్యక్తిగా జీవో 97ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరారు. పాల్ టెక్నీక్ విద్యార్థులను ఇంజినీరింగ్ నుండి లేబర్ డిపార్ట్మెంట్ కు అనుసంధానం చేయడం విద్యార్థులకు ఇష్టం లేదని అన్నారు. ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినప్పటికీ విద్యార్థులు అందుకు ఒప్పుకోవడం లేదని కావున విద్యార్థుల ఆందోళనలు, అపోహలు దృష్టిలో పెట్టుకొని జీవో 97 ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. పాల్ టెక్నీక్ విద్యాపై దేశ వ్యాప్తంగా ఏ పద్ధతి అయితే కొనసాగుతుందో అదే పద్ధతిని తెలంగాణ రాష్ట్రంలోనూ కొనసాగించాలని అన్నారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బల్దే వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు జూలూకుంట్ల శిరీష్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు అంబాటి కిషన్ రాజ్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




