Jangaon: జనగాం-హుస్నాబాద్ రోడ్డుపై ధర్నా.. గంటల తరబడి నిలిచిన ట్రాఫిక్
Jangaon: జనగాం జిల్లా హనుమంతపూర్ వద్ద ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు జనగాం-హుస్నాబాద్ రహదారిపై ధర్నా చేశారు.
Jangaon: జనగాం-హుస్నాబాద్ రోడ్డుపై ధర్నా.. గంటల తరబడి నిలిచిన ట్రాఫిక్
Jangaon: జనగాం-హుస్నాబాద్ ప్రధాన రహదారిపై హనుమంతపూర్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తక్షణమే లారీలు పంపాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకోవడంతో ధర్నా విరమించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ మాట్లాడుతూ హనుమంతపూర్ ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 300కు పైగా రైతులు తమ ధాన్యాన్ని ఎండబెట్టి సిద్ధంగా ఉంచినా,
అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గన్ని బ్యాగుల కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 300 మంది రైతులు ఉన్నప్పటికీ కేవలం 3000 బ్యాగులు మాత్రమే ఇచ్చి అధికారులు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు.అలాగే దాదాపు 150 లారీలకు సరిపడ ధాన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు 10 శాతం కూడా కొనుగోలు చేయలేదని తెలిపారు. మరోవైపు లారీ కాంట్రాక్టర్ ఫోన్ ఎత్తకపోవడం, జిల్లా కలెక్టర్ సహా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందన్నారు.




