Jangaon: జనగామ ప్రజావాణిలో 422 దరఖాస్తుల స్వీకరణ కలెక్టర్ ఆదేశాలు!

Jangaon: జనగామ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 422 వినతులు స్వీకరించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.

MD AHMAD PASHA, JANGAON
Updated on: 7 Sept 2026 4:15 PM IST
Jangaon
X

Jangaon: జనగామ ప్రజావాణిలో 422 దరఖాస్తుల స్వీకరణ కలెక్టర్ ఆదేశాలు!

Jangaon: జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన "ప్రజావాణి" కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వినతిపత్రాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులను తీసుకుంటూ వారి సమస్యల తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రజా సమస్యలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులకు సూచించారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం (422) దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈరోజు ప్రజావాణికి వచ్చిన కొన్నింటి దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి. దేవరుప్పుల మండలం, దేవరుప్పుల గ్రామానికి చెందిన కడారు లక్ష్మా రెడ్డి, 0.05 గుంటల భూమిని కొత్త పాస్ పుస్తకంలో నమోదు చేయాలని మనవి చేస్తూ ద‌రఖాస్తు చేసుకున్నారు.

లింగాల ఘనపురం మండలం, వనపర్తి గ్రామానికి చెందిన గంగపురం సుశీల, తన వ్యవసాయ భూమిని పట్టా చేయగలరని, అలాగే పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించగలరని విజ్ఞప్తి చేస్తూ ద‌ర‌ఖాస్తు చేసియున్నారు.

బచ్చన్నపేట మండలం, లింగంపల్లి గ్రామానికి చెందిన కర్ర రాం రెడ్డి, తాను దివ్యాంగులని, పింఛను రావడం లేదని, సదరం సర్టిఫికెట్ ఉందని, ఈ విషయమై పింఛను మంజూరు చేయగలరని ప్రార్థిస్తూ ఆర్జీ ద్వారా కోరారు.

పాలకుర్తి మండలం, ముత్తారం గ్రామానికి చెందిన కొండ కరుణాకర్ రెడ్డి, తను రెండు ఎకరాల కుష్కీ భూమిని కొన్నారని, రికార్డు ప్రకారం సర్వే నంబర్ లో లేదని, ఈ క్రమంలో భూమి సర్వే చేశారని, సర్వే నంబర్ ప్రకారం పాస్ పుస్తకం ఇప్పించుట గురించి దరఖాస్తును స‌మ‌ర్పించినారు.

ఘనపూర్ (స్టేషన్) మండలం, ఇంద్ర నగర్ కు చెందిన చింత అనూష, తనది నిరుపేద కుటుంబం అని, కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నారని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని వినతిని అందించారు. ఈ ప్ర‌జావాణిలో డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చినకోట్యా నాయక్, వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story