Jangaon: ఆగస్టు 31 లోగా చేయూత పింఛన్ల దరఖాస్తులకు అవకాశం!
Jangaon: తెలంగాణ చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు ఆగస్టు 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.
Jangaon: ఆగస్టు 31 లోగా చేయూత పింఛన్ల దరఖాస్తులకు అవకాశం!
Jangaon: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్హులైన ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని తన ఛాంబర్‌లో చేయూత సామాజిక భద్రతా పింఛన్ల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలోని అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులకు ప్రభుత్వం చేయూత పింఛన్ల ద్వారా సామాజిక భద్రత కల్పిస్తోందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు చేయూత పింఛన్లపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ఫ్లెక్సీలు, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రజలకు అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, చివరి తేదీపై అవగాహన కల్పించాలని సూచించారు.
చేయూత పింఛన్ల దరఖాస్తు ఫారాలను చేయూత వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, అలాగే నింపిన దరఖాస్తులను ఎంపీడీఓ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, మున్సిపాలిటీ కార్యాలయాల్లో సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.
అదే విధంగా మహిళా సమాఖ్యలు చేయూత సామాజిక భద్రతా పింఛన్ల అమలులో కీలక పాత్ర పోషించాలని సూచించారు. గ్రామాల్లోని అర్హులైన ప్రతి వితంతువు, ఒంటరి మహిళను గుర్తించి, పింఛన్ దరఖాస్తు చేసుకునేలా సహకరించాలని తెలిపారు. దరఖాస్తులు నింపడం, అవసరమైన ధ్రువపత్రాల సేకరణ, సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తుల సమర్పణ వరకు మహిళా సమాఖ్య సభ్యులు వారికి అండగా నిలవాలని సూచించారు.
జిల్లాలో ఇప్పటివరకు మొదటి విడతలో సుమారు 7,500 దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఇంకా అర్హత కలిగిన వారు చివరి తేదీ వరకు అవకాశాన్ని వినియోగించుకొని, దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.
పింఛను రకాలు అర్హతా ప్రమాణాలు
వితంతువులు:
18 సం.లు పైబడిన వారు
భర్త మరణ ధృవీకరణ పత్రం
ఒంటరి మహిళలు:
వివాహితులు: 18 సం.లు పైబడిన వారు, భర్తతో విడిపోయి/వదిలివేయబడి 1 సం.లు పైబడిన వారు
అవివాహితులు: గ్రామీణ ప్రాంతాల్లో 30 సం.లు పైబడిన వారు; పట్టణ ప్రాంతాల్లో 35 సం.లు పైబడిన వారు
దివ్యాంగులు:
వయసుతో సంబంధం లేదు
SADAREM / UDID ధృవీకరణ ద్వారా 40% వైకల్యం (వినికిడి లోపం ఉన్నవారికి 51%)
రక్త సంబంధిత దివ్యాంగులు:
తలసేమియా, సికిల్ సెల్ డిసీస్, హీమోఫీలియా (SADAREM / UDID ధృవీకరణ)
కల్లుగీత కార్మికులు:
50 సం.లు పైబడిన వారు
కల్లుగీత కార్మికుల సహకార సంఘ సభ్యత్వం
ఎక్సైజ్ శాఖ ధృవీకరణ
చేనేత కార్మికులు:
50 సం.లు పైబడిన వారు
చేనేత & జౌళి శాఖ ధృవీకరణ
ఫైలేరియా బాధితులు:
గ్రేడ్-II & III ఫైలేరియా వ్యాధిగ్రస్తులు
దరఖాస్తుల స్వీకరణ
గ్రామీణ ప్రాంతాలలో:
పంచాయతీ కార్యదర్శులు
మండల పరిషత్ అభివృద్ధి అధికారులు
పట్టణ ప్రాంతాలలో:
వార్డు అధికారులు
పురపాలక కమీషనర్లు
దరఖాస్తు ఫారాలను https://cheyutha.telangana.gov.in వెబ్‌సైట్‌లోని "cheyutha application forms" బటన్ నొక్కి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ కార్యక్రమంలో ఏపీడీ నూరుద్దీన్, డీపీఎం సతీష్, అడ్మిన్ అసిస్టెంట్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.




