Jangaon: రాఖీ వేళ ఆడబిడ్డకు అండగా జనగామ జిల్లా కలెక్టర్!
Jangaon: జనగామ జిల్లా నీర్మాల గ్రామానికి చెందిన సుల్తానా బేగంకు రాఖీ పండుగ వేళ స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్ అందజేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.
Jangaon: రాఖీ వేళ ఆడబిడ్డకు అండగా జనగామ జిల్లా కలెక్టర్!
Jangaon: జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం, నీర్మాల గ్రామానికి చెందిన మహమ్మద్ సుల్తానా బేగం జీవన పరిస్థితులను తెలుసుకొని, ఆమె స్వయం ఉపాధి పొందేందుకు కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల తన ఛాంబర్‌లో కుట్టు మిషన్‌ను అందజేశారు.
తన భర్త కుటుంబ బాధ్యతలను వదిలి వెళ్లిపోవడంతో నాలుగేళ్ల చిన్నారితో ఒంటరిగా జీవనం సాగిస్తున్న సుల్తానా బేగం, తనకు స్థిరమైన ఆదాయం లేదని, చిన్న పాపను పోషించేందుకు ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆమె పరిస్థితిని సహృదయంతో పరిశీలించిన కలెక్టర్, స్వశక్తితో జీవనోపాధి సంపాదించే మార్గాన్ని చూపాలనే ఉద్దేశంతో వెంటనే కుట్టు మిషన్‌ను అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి మహిళ తనలోని సామర్థ్యాన్ని నమ్ముకొని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. కష్టపడే వారికి అవకాశాలు తప్పక లభిస్తాయని, ఈ కుట్టు మిషన్ సుల్తానా బేగం జీవితానికి కొత్త ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. కుట్టు పనిని ఉపాధిగా మలుచుకొని తన చిన్నారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని, కుటుంబానికి అండగా నిలవడంతో పాటు సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలని సూచించారు.
రాఖీ పండుగ సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీక అని పేర్కొంటూ, సమాజంలోని ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు.
కుట్టు మిషన్ అందుకున్న మహమ్మద్ సుల్తానా బేగం, జిల్లా కలెక్టర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం తనకు కొత్త జీవితంపై ఆశను కల్పించిందని, కష్టపడి పని చేసి, తన కుమార్తెను మంచి చదువులు చదివించి, ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.
రాఖీ పండుగను పురస్కరించుకొని అందించిన ఈ కుట్టు మిషన్ ఒక మహిళ జీవితంలో కొత్త ఆశలకు నాంది పలికింది. కష్టపడి స్వశక్తితో జీవనోపాధి సంపాదిస్తూ తన చిన్నారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే ఆమె సంకల్పానికి ఇది బలమైన చేయూతగా నిలిచింది. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగితే ప్రతి మహిళ స్వావలంబన సాధించి, తన కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలవగలదనే సందేశాన్ని ఈ సంఘటన చాటి చెప్పింది.




