Gudur: యాప్ పేరుతో రైతులకు బురిడీ యూరియా నల్లబజారుకు తరలింపు!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరులో యూరియా దందా వెలుగుచూసింది. యాప్‌లో బుక్ చేసిన బస్తాలను నల్లబజారుకు తరలిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్.

B NARASIMHA, GUDUR
Published on: 14 Sept 2026 8:40 AM IST
Gudur
X

Gudur: యాప్ పేరుతో రైతులకు బురిడీ యూరియా నల్లబజారుకు తరలింపు!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో యూరియా పంపిణీలో అక్రమాలు వెలుగుచూశాయి. యూరియా యాప్ ద్వారా రైతులు ముందస్తుగా బుక్ చేసుకున్న బస్తాలు గాల్లో కలిసిపోతున్నాయి. కష్టపడి యాప్‌లో నిల్వలను బుక్ చేసుకుని, తీరా షాపు వద్దకు వెళ్లిన రైతులకు ఏరువాక నిరాశే ఎదురవుతోంది.

"యాప్ కొత్తగా వచ్చింది.. సాంకేతిక లోపాల వల్ల మీ యూరియా బస్తాల బుకింగ్స్ మిస్ అయ్యాయి" అంటూ షాపు యాజమాన్యం రైతులను నమ్మించి తప్పుదోవ పట్టిస్తోంది. నిజానికి రైతుల పేరు మీద వచ్చిన ఆ బస్తాలను వ్యాపారులు నల్లబజార్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యాయంగా తమకు రావాల్సిన యూరియా బస్తాల గురించి ప్రశ్నించడానికి వెళ్లిన రైతుల పట్ల షాపు యజమానులు తీవ్ర స్థాయిలో దురుసుగా ప్రవర్తిస్తూ, బెదిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు. ఓ వైపు పంటలకు యూరియా వేయాల్సిన సమయం మించిపోతుండటం, మరోవైపు బుక్ చేసుకున్న బస్తాలను కూడా ఇవ్వకుండా వ్యాపారులు నల్లబజారుకు తరలిస్తుండటంతో గూడూరు మండల రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది.

ఉపాధిని దెబ్బతీస్తూ, తమను మోసం చేస్తున్న సదరు యూరియా షాపు యాజమాన్యంపై వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని మండల రైతులు డిమాండ్ చేస్తున్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR