Bhupalpally: అడ్డదారుల్లో మద్యం రవాణా.. ఎక్సైజ్ నిఘా వైఫల్యమేనా?
Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మద్యం సిండికేట్ జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Bhupalpally: అడ్డదారుల్లో మద్యం రవాణా.. ఎక్సైజ్ నిఘా వైఫల్యమేనా?
భూపాలపల్లి: భూపాలపల్లిలో మద్యం దందా జోరుగా సాగుతోందనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. సూర్యోదయం కాకముందే ఉదయం 5 గంటల నుంచే బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారిక అనుమతులు లేని విక్రయ కేంద్రాలకు ఇంత తెల్లవారుజామునే మద్యం ఎలా చేరుతోంది? ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒక్క బీర్‌పై రూ.20.. క్వార్టర్‌పై రూ.30 వరకు అదనం?
బెల్ట్‌షాపులకు సరఫరా చేసే మద్యంపై ఒక్కో బీర్‌కు సుమారు రూ.20, క్వార్టర్ సీసాపై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో బెల్ట్‌షాపుల ద్వారా మద్యం విక్రయిస్తున్న కొందరు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అడ్డదారుల్లో ఆటోల పరుగులు
భూపాలపల్లి చుట్టుపక్కల గ్రామాల్లోని బెల్ట్‌షాపులకు ఆటోల ద్వారా మద్యం తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన రహదారులను తప్పించుకుని అడ్డదారులు, గ్రామీణ మార్గాల గుండా మద్యం తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ సరఫరా కొనసాగుతోందని ఆరోపిస్తున్నారు.
సుభాష్ కాలనీలో గోదాం?
మరోవైపు సిండికేట్‌గా ఏర్పడిన కొందరు వ్యాపారులు భూపాలపల్లిలోని సుభాష్ కాలనీలో ప్రత్యేకంగా గోదాం ఏర్పాటు చేసి, అక్కడి నుంచి చుట్టుపక్కల బెల్ట్‌షాపులకు మద్యం తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించి వాస్తవాలను వెలికితీయాల్సిన అవసరం ఉంది.
కుప్పలు తెప్పలుగా బెల్ట్‌షాపులు!
భూపాలపల్లి పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్‌షాపులు కొనసాగుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎక్సైజ్ నిఘా ఎక్కడ?
ఉదయం 5 గంటలకే మద్యం తరలింపు జరుగుతోందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ నిఘా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమంగా మద్యం సరఫరా జరుగుతుంటే అధికారులు గుర్తించలేకపోతున్నారా? లేక చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఉదయాన్నే మద్యం.. గ్రామాల్లో పెరుగుతున్న ఆందోళన
సూర్యోదయానికి ముందే మద్యం అందుబాటులోకి రావడంతో పనులకు వెళ్లాల్సిన కొంతమంది గ్రామస్తులు ఉదయాన్నే మద్యం సేవించే పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కుటుంబాలపై ఆర్థిక భారం పెరగడంతో పాటు మద్యం కారణంగా గ్రామాల్లో సామాజిక సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.
బెల్ట్‌షాపులపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ.. అసలు అక్రమ సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది? సుభాష్ కాలనీలో గోదాం ఉందన్న ఆరోపణల్లో నిజమెంత? ఉదయం 5 గంటలకే మద్యం తరలిస్తున్న వారెవరు? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.




